Begin typing your search above and press return to search.

'పెద్ది' ముందైనా క్లియర్ చేస్తారా?

అదే సమయంలో థియేటర్లలో ఏసీ సమస్యలు హాట్ టాపిక్‌ గా మారడం చర్చకు దారితీస్తోంది. పెద్ది లాంటి పెద్ద సినిమా వస్తున్న వేళ కనీస సౌకర్యాల పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న వినిపిస్తోంది.

By:  M Prashanth   |   20 May 2026 6:28 PM IST
పెద్ది ముందైనా క్లియర్ చేస్తారా?
X

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. ఇప్పుడు థియేటర్ యాజమాన్యాల్లో కూడా అంతే టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాతో భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. అదే సమయంలో థియేటర్లలో ఏసీ సమస్యలు హాట్ టాపిక్‌ గా మారడం చర్చకు దారితీస్తోంది. పెద్ది లాంటి పెద్ద సినిమా వస్తున్న వేళ కనీస సౌకర్యాల పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న వినిపిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన మూవీ తర్వాత బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న చిత్రం కావడం, రామ్ చరణ్ పూర్తి మాస్ అవతార్‌ లో కనిపించనుండడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ గా మారింది.

యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, డైలాగులు, గ్రామీణ నేపథ్యంలోని విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే అదే సమయంలో థియేటర్ల పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఏసీలు సరిగా పనిచేయడం లేదని విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.

బయట ఎండలు భగ్గుమంటున్న వేళ థియేటర్ లో కూడా సరైన కూలింగ్ లేకపోతే ప్రేక్షకులు అసౌకర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పలువురు ప్రేక్షకులు థియేటర్లలో వేడి ఎక్కువగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఓటీటీ ఎఫెక్ట్ తో ఆడియన్స్ థియేటర్‌ కు రావాలంటే స్పెషల్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా బాగున్నా, థియేటర్‌ లో కంఫర్ట్ లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు థియేటర్‌ కు రావాలంటే కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో ప్రేక్షకుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఏసీ సమస్యలు, మెయింటెనెన్స్ లోపాలు ఉంటే నెగిటివ్ టాక్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇది కలెక్షన్లపై కూడా ప్రభావం చూపొచ్చని టాక్ వినిపిస్తోంది.. అందుకే పెద్ది విడుదలకు ముందే థియేటర్ యాజమాన్యాలు ఆ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు చిత్ర యూనిట్ ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. అభిమానుల్లో సినిమా కోసం ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో థియేటర్లలో అన్ని సౌకర్యాలు సరిగ్గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి పెద్ది ముందైనా థియేటర్లలోని ఏసీ సమస్యలు పూర్తిగా క్లియర్ అవుతాయా? లేదా అనేది ఇప్పుడు వేచి చూడాలి.