'పెద్ది' కొత్త అప్‌డేట్ వచ్చేసింది
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 2 July 2025 4:32 PM ISTరామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ షాట్ ను ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. చాలా మంది క్రికెటర్స్ ఇలా కూడా ఆడవచ్చా అనుకున్నారు, కొందరు ఈ షాట్ ను ట్రోల్ చేశారు. మొత్తానికి పెద్ది సినిమా గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పెద్ది సినిమా షూటింగ్ విషయంలో బుచ్చిబాబు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. సినిమా 2026 మార్చిలో ఉంది కదా, నిదానంగా షూటింగ్ చేద్దామని అస్సలు అనుకోవడం లేదు. ఇప్పటి వరకు షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం 50 వర్కింగ్ డేస్‌లో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ నెలలో ఢిల్లీలో దాదాపు 12 నుంచి 14 రోజుల పాటు షూటింగ్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీ షెడ్యూల్‌లో కీలకమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబో సీన్స్‌ను షూట్ చేస్తారు. ఇంకా సినిమా చివరి దశ షూటింగ్‌ను రెండు షెడ్యూల్స్ లో రెండు రెండు వారాల చొప్పున షూటింగ్ చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఆ షూటింగ్ ఉండే అవకాశం ఉంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ వరకు పెద్ది సినిమా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి కాకుంటే నవంబర్ లో ఖచ్చితంగా షూటింగ్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సినిమా ప్రమోషన్‌కి చాలా ఎక్కువ సమయం లభిస్తుంది. ఫిబ్రవరి నుంచే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టేందుకు గాను దర్శకుడికి చాలా సమయం ఉంటుంది. అందుకే పెద్ది సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక హీరోయిన్‌ను ఐటెం సాంగ్ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప 2 లోని కిస్సిక్ రేంజ్‌లో ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెహమాన్ తో ఇప్పటికే ఆ పాట ట్యూన్ చేయించారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనలో ఐటెం సాంగ్ చేయించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఐటెం సాంగ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడట. ప్రముఖ హీరోయిన్‌ను ఐటెం సాంగ్‌లో నటింపజేసే అవకాశాలు ఉన్నాయి. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్మకంగా చెబుతున్నారు.
