Begin typing your search above and press return to search.

'పెద్ది' కోసం బుచ్చిబాబు ఆ ప్రయోగం...!

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'పెద్ది'. ఈ సినిమాకు ముందు రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   26 Jun 2025 6:00 PM IST
పెద్ది కోసం బుచ్చిబాబు ఆ ప్రయోగం...!
X

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'పెద్ది'. ఈ సినిమాకు ముందు రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువగానే చరణ్‌ కష్టపడుతున్నాడు. చాలా కసి మీద ఉన్న రామ్‌ చరణ్‌ పెద్ది సినిమా కోసం డే అండ్‌ నైట్‌ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రత్యేకమైన పాటను దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్‌ చేస్తున్నాడట.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి సినిమాతోనే వంద కోట్లకు మించిన వసూళ్లు రాబట్టడంతో బుచ్చిబాబు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపించారు. ఉప్పెన విడుదల అయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమాను చేసే అవకాశంను బుచ్చిబాబు దక్కించుకున్నాడు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో ఎన్టీఆర్‌తో సినిమాను పక్కన పెట్టి రామ్‌ చరణ్‌తో సినిమాను మొదలు పెట్టాడు. చరణ్‌ తో మూవీ కోసం దాదాపు ఏడాది వెయిట్‌ చేసిన బుచ్చిబాబు ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో సినిమాను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తన గురువు సుకుమార్‌ నుంచి అన్ని గుణాలను, సుగుణాలను పుణికి పుచ్చుకున్న బుచ్చిబాబు ఫిల్మ్‌ మేకింగ్‌ విషయంలోనూ అదే మార్క్ చూపిస్తున్నాడు. హీరోలను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఫిదా అవుతారు, బాక్సాఫీస్‌ షేక్ కావాలంటే ఎలాంటి కథలు, కథనాలు కావాలి అనే విషయాలు బుచ్చిబాబు బాగానే గుర్తించినట్లు ఉన్నాడు. అందుకే తన మొదటి సినిమాలో లేని ఐటెం సాంగ్‌ను రామ్‌ చరణ్‌తో రూపొందిస్తున్న 'పెద్ది' సినిమాలో పెట్టబోతున్నాడట. ఈ సినిమాకు ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. రెహమాన్‌ ఇప్పటికే ఒక ప్రత్యేకమైన పాట కోసం ట్యూన్‌ రెడీ చేశాడని, రాబోయే రోజుల్లో అత్యధికంగా వినిపించే పాటగా పెద్ది ఐటెం సాంగ్‌ నిలవబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

రామ్‌ చరణ్‌కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ దేవర తర్వాత మరో భారీ విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన మరో స్టార్‌ హీరోయిన్‌తో ఈ సినిమాకి ఐటెం సాంగ్‌ చేయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు మనసులో ఒక హీరోయిన్‌ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్‌ ఎవరు, ఎప్పుడు ఆ ఐటెం సాంగ్‌ షూటింగ్‌ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌ వరకు పెద్ది షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టే విధంగా దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్‌ చేస్తున్నాడు.