Begin typing your search above and press return to search.

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌లో బాబాయ్-అబ్బాయ్ భేటీ

రామ్ చ‌ర‌ణ్ టీష‌ర్ట్ తొడుక్కుని రేబాన్ తో అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్కులో క‌నిపించ‌గా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో చాలా సింపుల్ గా ఆధ్యాత్మిక పంథాలో క‌నిపించారు.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 11:32 PM IST
మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌లో బాబాయ్-అబ్బాయ్ భేటీ
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబాయ్, అబ్బాయిల ఈ కలయికకు సంబంధించిన ఫోటోలు -ఇత‌ర వివరాలు ప్రస్తుతం సాషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అమరావతిలోని ఏసీఏ (ACA) ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే `ఆంధ్ర ప్రీమియర్ లీగ్` మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ టోర్నమెంట్‌కు వెళ్లే ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లి పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం రామ్ చరణ్ అమరావతి క్రికెట్ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు.

ముఖ్యంగా ఈ భేటీ స‌మ‌యంలో బాబాయ్ - అబ్బాయ్ డ్రెస్సింగ్ సెన్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రామ్ చ‌ర‌ణ్ టీష‌ర్ట్ తొడుక్కుని రేబాన్ తో అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్కులో క‌నిపించ‌గా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో చాలా సింపుల్ గా ఆధ్యాత్మిక పంథాలో క‌నిపించారు. బాబాయ్ - అబ్బాయ్ పూర్తిగా ఒక‌రికొక‌రు విరుద్ధ‌మైన దుస్తుల‌లో క‌నిపించిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి.

`ఆంధ్ర ప్రీమియర్ లీగ్` మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి..

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న `ఆంధ్ర ప్రీమియర్ లీగ్` (APL) మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప‌లు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ జట్ల మధ్య లీగ్ దశలో హోరాహోరీ పోరాటాలు సాగేలా షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ -ఎలిమినేటర్ మ్యాచ్‌ల ద్వారా నాకౌట్ దశకు చేరుకుంటాయి.

ఈ టోర్నమెంట్‌లోని అత్యధిక మ్యాచ్‌లు... కీలకమైన ఫైనల్ పోరు అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు వైజాగ్, అనంతపురం వంటి ప్రధాన వేదికలపై నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వీలుగా కొన్ని రోజుల్లో డబుల్ హెడర్స్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉండేలా మధ్యాహ్నం- సాయంత్రం సమయాల్లో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టీ20 ఫార్మాట్‌లో సాగే ఈ మ్యాచ్‌లు స్థానిక క్రికెట్ ప్రతిభను వెలికితీయడంతో పాటు అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.