Begin typing your search above and press return to search.

చరణ్ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే..

గేమ్ ఛేంజర్ మూవీ నిరాశ పరచడం రామ్ చరణ్ కెరీర్ మీద గట్టి ప్రభావం చూపిందని అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:15 AM
చరణ్ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే..
X

గేమ్ ఛేంజర్ మూవీ నిరాశ పరచడం రామ్ చరణ్ కెరీర్ మీద గట్టి ప్రభావం చూపిందని అనిపిస్తోంది. వాస్తవానికి శంకర్ దర్శకత్వం, భారీ బడ్జెట్, డబుల్ రోల్, స్టార్ క్యాస్ట్ వంటి హైప్ ఉన్నా, కంటెంట్ లో ఉన్న లోపాల వల్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. RRR తర్వాత మళ్లీ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్‌కి ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఓ గట్టిపాఠం అయింది. అందుకే ఇక నుంచి ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ పెద్ది మీద భారీ అంచనాలు ఉన్నాయి. బుచిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్, గ్లింప్స్‌ లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. చరణ్ రగ్డ్ లుక్, మాస్ డైలాగ్ డెలివరీ, సంగీతానికి రెహమాన్ మ్యాజిక్ వంటి అన్ని అంశాలు సినిమాపై అటెన్షన్ పెంచాయి. బుచిబాబు కూడా ఈ సినిమాతో తనను దర్శకుడిగా మరో లెవెల్‌కు తీసుకెళ్లాలన్న ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నాడు.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న, చరణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు. ఇంతకే కాదు, చరణ్ తదుపరి ప్రాజెక్టు మళ్లీ రంగస్థలం దర్శకుడు సుకుమార్‌తో కన్ఫర్మ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఇది మరో రస్టిక్ ఎంటర్టైనర్‌గా రూపొందనుంది. రంగస్థలం తరహాలోనే ఎమోషన్, నేటివిటీ, మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన కథ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని సమాచారం.

2025 చివరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌తో చరణ్ కలిసి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మూడో ప్రాజెక్ట్ విషయంలో రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ ఐడియా చెప్తే చరణ్ వెంటనే ఓకే చేశాడట.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ సినిమా పూర్తిచేయగానే చరణ్ సినిమా పనులు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు - పెద్ది, సుకుమార్ ప్రాజెక్ట్, త్రివిక్రమ్ సినిమా చరణ్‌కి తిరిగి మాస్ మార్కెట్‌లో నిలదొక్కుకునే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. వరుస హిట్లతో హ్యాట్రిక్ అందుకోవాలన్న లక్ష్యంతో ఆయన ఈ లైనప్‌ను సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ ఛేంజర్ దెబ్బ తర్వాత, ఈ మూడు సినిమాలు చరణ్‌కు తిరిగి బాక్సాఫీస్ పరంగా గేమ్ ఛేంజ్ చేసే అవకాశముందంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.