రామ్ చరణ్ 'మెరుపు' మూవీ చేసి ఉంటే వేరేలా ఉండేదా? ఆ మూవీ ఆగిపోవడానికి కారణం ఎవరు?
కానీ మొదటి షెడ్యూల్ కే 9 కోట్ల రూపాయలను ఖర్చు చేయించడంతో ఈ సినిమా బడ్జెట్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని సినిమాను క్యాన్సిల్ చేయించాడట.
By: Tupaki Desk | 20 Sept 2026 8:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే 'చిరుత' సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ 'మగధీర' మూవీ తో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ మూవీతో దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఆయన తన మూడో సినిమా అయిన 'ఆరెంజ్' మూవీతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమాకి నాగ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో ఆయనకి విపరీతమైన నష్టాలైతే వచ్చాయి. దాంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా విషయంలో ఆచుతూచి వ్యవహరించాలి అనుకున్నాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో 'బంగారం' సినిమా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ధరణి చిరంజీవికి ఒక కథను వినిపించాడు. ఆ కథ బాగుండడమే కాకుండా రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించిన చిరంజీవి ఆ సినిమాని స్టార్ట్ చేయించాడు.
రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా 'మెరుపు' అనే టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమా ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుండడంతో చిరంజీవి ఈ సినిమాని ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఓవర్ బడ్జెట్ కారణంగా ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని గమనించిన చిరంజీవి ఈ సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్లో చేయమని చెప్పారట.
కానీ మొదటి షెడ్యూల్ కే 9 కోట్ల రూపాయలను ఖర్చు చేయించడంతో ఈ సినిమా బడ్జెట్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని సినిమాను క్యాన్సిల్ చేయించాడట. ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్స్ కి నష్టాలు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆ సినిమాని మొదటి షెడ్యూల్ తోనే క్లోజ్ చేశారట. నిజానికి కమర్షియల్ హంగులతో పాటు ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికి చిరంజీవి అలాంటి డిసిజన్ తీసుకోవడానికి గల కారణం రామ్ చరణ్ అంతకుముందు చేసిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడమే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక అదే సమయంలో సంపత్ నంది చెప్పిన 'రచ్చ' సినిమా కథ బాగుండడం అది లిమిటెడ్ బడ్జెట్ లో పూర్తవుతుందని సంపత్ నంది చెప్పడంతో మెరుపు సినిమాని ఆపేసి రామ్ చరణ్ మెరుపు సినిమా కోసం కేటాయించిన డేట్స్ ను సంపత్ నందికి ఇచ్చాడు.
దాంతో సంపత్ నంది రచ్చ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ చరణ్ కి సైతం కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ ఆరెంజ్ ప్లాప్ నుంచి కోలుకొని మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి... నిజానికి అంత బాగానే ఉంది కానీ రామ్ చరణ్ మెరుపు మూవీ చేసి ఉంటే అతనికి ఒక డిఫరెంట్ ఇమేజ్ వచ్చేదని ఆ కథ ను విన్నా కొంతమంది రచయితలు చిరంజీవి తో చెప్పారట. ఆ విషయానికి చిరంజీవి పెద్దగా స్పందించలేదట. ఏది ఏమైనా కూడా ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎప్పుడు ప్లాప్ లను మూటగట్టుకుంటారో ఎవ్వరికి తెలియదు...
