భోపాల్ ఈవెంట్ లైవ్: చరణ్ మోచేతి గాయం ఇంకా నయం కాలేదా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `పెద్ది` ప్రమోషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోరెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 24 May 2026 12:02 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `పెద్ది` ప్రమోషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోరెత్తుతున్నాయి. ఇంతకుముందు ముంబై ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో నిర్వహించిన మెగా ఈవెంట్ భారీ జనసందోహంతో కిక్కిరిసింది. అయితే ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్‌ను చూసిన అభిమానులను ఒక విషయం మాత్రం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో చరణ్ చేతికి కట్టుతో కనిపించగా.. ఈ భోపాల్ ఈవెంట్‌లోనూ తన చేతి కట్టు (సపోర్టింగ్ ప్లాస్టర్) తీయకపోవడంతో మోచేతి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. గాయం కొంత ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తున్నా.. చరణ్ తన చేతిని చాలా సులువుగానే అటూ ఇటూ తిప్పుతూ వేదికపై ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఫ్యాన్స్‌కు కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది.
ఈ గాయం వెనుక ఉన్న అసలు కథను రామ్ చరణ్ గతంలోనే స్వయంగా వెల్లడించారు. ``నిజమైన పహిల్వాన్‌లతో కుస్తీ పట్లు పట్టిన ఫలితమే ఈ గాయం. ఇది దర్శకుడు బుచ్చిబాబు నాకు ఇచ్చిన ఒక అందమైన కానుక`` అంటూ చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు నెలరోజుల పాటు నాన్‌స్టాప్‌గా భారీ కుస్తీ షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అయితే సాధారణంగా సినిమాల్లో వాడే ఫైట్ మాస్టర్స్ లేదా ట్రైన్డ్ ఆర్టిస్టులకు బదులుగా.. సీన్లలో సహజత్వం కోసం నిజమైన పహిల్వాన్లను బుచ్చిబాబు బరిలోకి దించారు. దాంతో షూటింగ్‌లో డైరెక్టర్ `యాక్షన్` అని చెప్పగానే.. సదరు ఒరిజినల్ పహిల్వాన్లు ఆ వేగంలో చరణ్‌ను చాలా బలంగా పట్టుకోవడంతో ఆయన చేతి మణికట్టు ఎముక విరిగి గాయమైంది.
భోపాల్ మెగా ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటతో పాటు చిత్ర నిర్మాతలు, పీటర్ హెయిన్స్ వంటి సాంకేతిక నిపుణులు.. సహ నటీనటులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నార్త్ బెల్ట్‌లో తెలుగు సినిమా ప్రమోషన్స్ ఈ రేంజ్‌లో జరగడం చూసి అక్కడి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. చరణ్ చేతికి గాయమైనా.. భోపాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఈవెంట్ ముగిసే వరకు అక్కడే ఉండటం విశేషం.
ఇక ఈ ఈవెంట్‌లో అసలైన హైలైట్‌గా నిలిచింది ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ లైవ్ మ్యూజికల్ కాన్సెర్ట్. ఈ లైవ్ షో కోసం భోపాల్ నగరంలోని వేలాది మంది అభిమానులు, కాలేజ్ యూత్ భారీగా తరలివచ్చి గ్రౌండ్‌ను పునీతం చేసారు. సాధారణంగా మెలోడీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రెహమాన్.. ఈ `పెద్ది` ఈవెంట్‌లో మాత్రం తన రూట్ మార్చి సినిమాలోని ఊరమాస్ సాంగ్స్ పాడుతూ స్టేజ్ పై ఊహించని జోష్ నింపారు. ఈ చిత్రంలోని పాటలన్నీ పక్కా మాస్ బీట్స్‌తో కూడుకున్నవి కావడంతో భోపాల్ యూత్ ఊగిపోయారు. స్టేజ్ ముందే కూర్చున్న రామ్ చరణ్ సైతం తన గాయాన్ని మర్చిపోయి రెహమాన్ మాస్ మ్యూజికల్ షోను ఎంతో గొప్పగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
రెహమాన్ మాస్ ఆల్బమ్.. చరణ్ రా అండ్ రస్టిక్ లుక్... జాన్వీ గ్లామర్ అన్నీ కలిపి `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే నమ్మకాన్ని ఈ భోపాల్ ఈవెంట్ సక్సెస్ స్పష్టం చేస్తోంది.
