Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకోండి..ఇండియా టాప్ 4 డైరెక్ట‌ర్ల‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది!

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ తమ కుటుంబానికి ఎంతో లక్కీ అని.. నాన్నగారి ఇంద్ర, ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజయోత్సవాలు ఇక్కడే జరిగాయని గుర్తుచేసుకున్నారు.

By:  Sivaji Kontham   |   2 Jun 2026 9:28 AM IST
రాసి పెట్టుకోండి..ఇండియా టాప్ 4 డైరెక్ట‌ర్ల‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది!
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం`పెద్ది' ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక ప్రొఫెషనల్ ఎంఎంఏ (MMA) ఫైటర్ తరహాలో ఆయన ఇచ్చిన పవర్ ప్యాక్డ్ ఎంట్రీ చూసి అభిమానులు ఉర్రూతలూగారు.

పెద్ది వేడుక‌లో చ‌ర‌ణ్ ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడుతుంటే ఫ్యాన్స్ లో పూన‌కాలు వ‌చ్చాయి. ఊక వేస్తే రాల‌నంత‌మంది భారీ జ‌న సందోహం న‌డుమ చ‌ర‌ణ్ ఉద్వేగం అంద‌రినీ ఆక‌ర్షించింది. రాసి పెట్టుకోండి..ఇండియా టాప్ 4 డైరెక్ట‌ర్ల‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది! అంటూ ఈవెంట్లో బుచ్చిబాబును అత‌డు హైలైట్ చేసిన తీరు చూస్తుంటే పెద్ది గ్రాండ్ స‌క్సెస్ పైనా, ద‌ర్శ‌కుడి అసాధార‌ణ ప్ర‌తిభ పైనా అత‌డు ఎంత న‌మ్మ‌కంగా ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు...

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ తమ కుటుంబానికి ఎంతో లక్కీ అని.. నాన్నగారి ఇంద్ర, ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజయోత్సవాలు ఇక్కడే జరిగాయని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వివరిస్తూ.. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాల సమయంలో తనకు ఎలాంటి ఉత్సాహం కలిగిందో.. మళ్ళీ `పెద్ది` చేసేటప్పుడే అటువంటి అనుభూతి కలిగిందని చరణ్ స్పష్టం చేశారు.

అభిమానులపై తనకున్న ప్రేమాభిమానాలను చరణ్ భావోద్వేగపూరితంగా షేర్ చేసారు. మీ కోసం చెయ్యి విర‌గ్గొట్టుకోవ‌డ‌మే కాదు..రక్తం చిందించి.. ప్రాణమిస్తాను! అని ఆయన చేసిన వ్యాఖ్యలు మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి గారి కొడుకుగా, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిగా తనకు తెలిసిందల్లా సినిమా మాత్రమేనని... తాను ఉన్నంత కాలం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.

చిత్రబృందం గురించి మాట్లాడుతూ.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు వెన్నెముక అని.. దాదాపు 280 రోజుల తమ కష్టానికి ఆయన తన సంగీతంతో ప్రాణం పోశారని కొనియాడారు. అలాగే కథానాయిక జాన్వీ కపూర్ గురించి చెబుతూ.. ఆమె తన తల్లి శ్రీదేవి గారి కంటే పెద్ద స్టార్ కావాలని ఆకాంక్షించారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తనను అద్భుతంగా చూపించారని... నిర్మాత సతీష్ కిలారు ఎంతో అనుభవజ్ఞుడిలా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించారని ప్రశంసించారు.

`పెద్ది` చిత్ర ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ.. `ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడి ఓటమి మాత్రమే కాదు... ఒక దేశం ఓడిపోయినట్టే.. పెద్ది ఆడలేదు, పోరాడాడు`` అని సినిమాపై అంచనాలను పెంచేశారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ చిత్రం ఆత్మగౌరవ పోరాటంలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌లో ఎంపీ కేసినేని చిన్ని, మంత్రి కందుల దుర్గేష్ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.