రాజ్‌పాల్‌కి హైకోర్టు బెయిల్ .. కండిషన్లు అప్లయ్
బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 16 Feb 2026 7:11 PM ISTబాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజా పరిణామం ప్రకారం.. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2012లో తన మొదటి దర్శకత్వ చిత్రం `అతా పతా లాపతా` కోసం తీసుకున్న అప్పు, వడ్డీతో కలిపి ఇంత పెద్ద మొత్తానికి చేరుకోగా చివరకు అది జైలు శిక్ష వరకు వెళ్లింది.
అయితే బెయిల్ ఇచ్చిన కోర్టు కొన్ని కఠిన షరతులు విధించింది. కేవలం 1.5 కోట్లు జమ చేసినందున కోర్టు ఆయన శిక్షను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేసింది. అలాగే అతడి పాస్‌పోర్ట్ ను స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. ఈ స్టే మార్చి 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. అతడు 1 లక్ష వ్యక్తిగత బాండ్‌తో పాటు అంతే మొత్తానికి ఒక షూరిటీని సమర్పించాలి. తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పగించాలి .మార్చి 18న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలి. ఫిబ్రవరి 19న షాజహాన్‌పూర్‌లో తన మేనకోడలి వివాహం ఉన్నందున ఆయనకు కోర్టు ఈ వెసులుబాటు కల్పించింది.
రాజ్‌పాల్ యాదవ్ మేనేజర్ గోల్డీ ప్రకారం.. త్వరలోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అసలు ఏం జరిగిందనేది అతడు స్వయంగా వెల్లడించనున్నారు. మార్చి 18న జరిగే తదుపరి విచారణలోగా మిగిలిన బకాయిలపై ఆయన ఒక స్పష్టమైన ప్రణాళికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
ఎట్టకేలకు బెయిల్ వచ్చినందుకు అభిమానులకు కొంత రిలీఫ్ దక్కింది. పరిశ్రమ మద్ధతుకు రాజ్ పాల్ కుటుంబం తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తోంది. రాజ్‌పాల్ యాదవ్ తన విలక్షణమైన నటనతో ఎంతో మందిని నవ్వించారు. ఆయన ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కేసు నేపథ్యం..
అసలు అతడు అప్పు ఎందుకు చేసాడు? అంటే 2010లో `అతా పతా లాపతా` సినిమాని నిర్మించేందుకు, నిర్మాతగా సత్తా చాటాలనే పట్టుదలతో అతడు రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. కానీ అతడి కలలు కల్లలయ్యేలా సినిమా డిజాస్టరైంది. మొత్తం లాస్ వచ్చింది. దీంతో అసలు వడ్డీతో కలిపి రూ.9 కోట్లు అయ్యింది. ఆయన ఇచ్చిన 7 చెక్కులు బౌన్స్ కావడంతో 2018లో ఆయనకు శిక్ష పడింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న కారణంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయన 5 ఫిబ్రవరి 2026న లొంగిపోయి జైలుకు వెళ్లారు. దాదాపు 11 రోజుల తర్వాత ఆయనకు ఈ విముక్తి లభించింది.
సినీ పరిశ్రమ మద్దతు..
రాజ్‌పాల్ యాదవ్ కష్టాల్లో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, సోనూ సూద్ వంటి స్టార్స్ ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయాన్ని ప్రకటించడం సినీ ఇండస్ట్రీలో సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది. రావ్ ఇంద్రజీత్ సింగ్ రూ.1.1 కోట్లు సాయం ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 11 లక్షలు సాయం చేశారు. బాక్సర్ విజేందర్ సింగ్ తన తదుపరి సినిమాలో రాజ్‌పాల్‌కు అవకాశం ఇస్తానని ప్రకటించి మద్దతు తెలిపారు.
