Begin typing your search above and press return to search.

'జైలర్‌' కుర్రాడు కాదు తాతగారు...!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   2 Aug 2023 9:51 AM GMT
జైలర్‌ కుర్రాడు కాదు తాతగారు...!
X

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి. రోబో సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని రజినీకాంత్‌ అందుకోలేక పోయాడు.

భారీ కమర్షియల్‌ సక్సెస్‌ లు లేకున్నా కూడా రజినీకాంత్ పై ఉన్న అభిమానంతో తాజా చిత్రం జైలర్ ను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు లో కూడా సాధ్యం అయినంత ఎక్కువ థియేటర్లలో జైలర్‌ ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

జైలర్‌ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే కథ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో రజినీకాంత్ గత చిత్రాల్లో మాదిరిగా కుర్రాడిగానో... మధ్య వయస్కుడిగానో కనిపించడం లేదు. ఒక తాత పాత్రలో రజినీకాంత్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

'విక్రమ్‌' సినిమాలో కమల్‌ హాసన్ తాత పాత్రలో కనిపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఆ సెంటిమెంట్‌ ను రిపీట్‌ చేసే ఉద్దేశ్యమో లేదంటే వయసుకు తగ్గ పాత్ర అనుకున్నాడో కానీ జైలర్ సినిమాలో ఆరు ఏళ్ల బాబుకు తాతగా రజినీకాంత్ కనిపించబోతున్నాడు.

కథ విషయానికి వస్తే... రజినీకాంత్‌ ఒక రిటైర్డ్‌ జైలర్‌. ఆయన తనయుడు అసిస్టెంట్‌ కమీషనర్‌. ఒక కేసు విచారణ సమయంలో రజినీకాంత్ తనయుడు కనిపించకుండా పోతాడు. దాంతో రంగంలోకి దిగిన మాజీ జైలర్‌ తన కొడుకును ఎలా కాపాడుకుంటాడు... ఆ కేసును ఎలా సాల్వ్‌ చేస్తాడు అనేది కథ.

కొడుకు యొక్క కొడుకు తో ఉండే సన్నివేశాల్లో రజినీకాంత్‌ తాతగా అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జైలర్ కుర్రాడు లేదా అంకుల్ కాదు.. ఒక తాత అని తమిళ్ మీడియాలో ప్రధానంగా ప్రచారం జరుగుతోంది.