Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్.. ఈ న‌సేంటి భ‌రించ‌లేం!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 3:00 AM GMT
ర‌జ‌నీకాంత్.. ఈ న‌సేంటి భ‌రించ‌లేం!
X

ఒక సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ న‌టుడై, సూప‌ర్ స్టార్ గా ఆవిర్భ‌వించి ఒక పరిశ్ర‌మ‌నే శాసించే స్థాయికి ఎద‌గ‌డం అన్న‌ది గొప్ప సంచ‌ల‌నం. అలాంటి సంచ‌ల‌న స్టార్ ర‌జ‌నీకాంత్. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది. నిస్సందేహంగా తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ర‌జ‌నీ ఒక‌రు. రజనీకాంత్ వ్యక్తిగతంగా తమిళ డయాస్పోరాకు చెందినవారు కాదు, అయితే తమిళ చిత్రసీమలో ఆయన శిఖ‌రం ఎత్తుకు ఎదగ‌డం ఒక సంచ‌ల‌నం.

ఆయ‌న‌ పుట్టినరోజు లేదా ఇతర సెలవు దినాలలో త‌న‌ ఇంటి వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడం చూస్తే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో చెప్ప‌గ‌లం. సంక్రాంతి, దీపావళి, కార్మిక దినోత్సవం వంటి వేడుక రోజులలో తన పోయెస్ గార్డెన్ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేస్తారు. ఇటీవ‌ల‌ అభిమానులు సాధారణంగా అతనిని చూడటానికి గంటల త‌ర‌బ‌డి వేచి ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. రజనీకాంత్ ఇంటి వెలుపల అభిమానుల ర‌చ్చ‌కు పొరుగువారు ఎంత‌గా విసిగిపోయారో తాజా ఉదంతం చెబుతోంది. రెసిడెన్షియల్ ఏరియాలో అభిమానులు చేస్తున్న సందడితో ర‌జ‌నీ ఇరుగుపొరుగున ఉన్న‌ కొందరు చిరాకు పడుతున్నారని ప్ర‌ముఖ త‌మిళ మీడియా క‌థ‌నం వెలువ‌రించింది.

ర‌జ‌నీ ఇంటి సమీపంలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళ బయటకు వెళ్లి తన బాధను వినిపించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రతి కార్యక్రమం తెల్లవారుజామున ఇంటి బయటి నుండి వచ్చే శబ్దంతో ప్రారంభమవుతుందని ఆమె పేర్కొంది. సెలవు రోజున కూడా తాను ఇంట్లో విశ్రాంతి తీసుకోలేనని పేర్కొంది. ``మేము కూడా పన్నులు చెల్లిస్తాము,.. కానీ ఎందుకు ఇలా బాధపడాలి? అని ఆ వృద్ధురాలు ప్ర‌శ్నించింది. రజనీకాంత్ నివాసం వ‌ద్ద‌ కాకుండా వేరే చోట తన అభిమానులు, అనుచ‌రుల‌ను కలవాలని కూడా ఆమె సూచించారు. ఇటీవల రజనీకాంత్ సంక్రాంతి శుభాకాంక్షలు పోస్ట్ చేస్తూ ``ఈ పొంగల్ రోజున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మనశ్శాంతితో సంతోషంగా ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జీవితంలో క్రమశిక్షణ ఆలోచనలో నిజాయితీ ఉంటే, జీవితం ప్రశాంతంగా ఉంటుంది.. సంతోషంగా ఉంటుంది`` అని అన్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ పుదుచ్చేరిలో వెట్టయాన్ సినిమా చేస్తున్నారు. పొంగల్ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని తార‌ల‌తో పోస్టర్‌ను చిత్రనిర్మాతలు పబ్లిక్ చేశారు. రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.