Begin typing your search above and press return to search.

ఇడ్లి వడ కాంట్రవర్సీ : షారుఖ్ వ్యాఖ్యలతో రజనీ అప్సెట్ అయ్యారా?

అంగరంగ వైభవంగా జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త వివాదానికి తెరలేపాయి

By:  Tupaki Desk   |   6 March 2024 6:57 AM GMT
ఇడ్లి వడ కాంట్రవర్సీ :  షారుఖ్ వ్యాఖ్యలతో రజనీ అప్సెట్ అయ్యారా?
X

అంగరంగ వైభవంగా జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త వివాదానికి తెరలేపాయి. అంబానీ వారి ఇంట పెళ్ళి సందడిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అవమానం జరిగిందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చెర్రీని ఉద్దేశిస్తూ 'ఇడ్లీ.. వడా.. సాంబార్' అంటూ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అప్సెట్ అయ్యారా? అనే చర్చ కూడా మొదలైంది.

భారతదేశంలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. గుజరాత్‏లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు హాజరైన సంగతి తెలిసిందే. సెలబ్రేషన్స్ లో భాగంగా ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, ఆమిర్ లు స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. అయితే ఈ సందర్భంగా చరణ్ ను షారుక్ వేదికపైకి పిలిచిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో, అక్కడే RRR హీరో ఉండటంతో ‘రామ్‌ చరణ్‌ ఎక్కడా?’ అని పిలిచారు ఖాన్ త్రయం. ఆ వెంటనే షారుక్ మైక్ అందుకొని తమిళ్ లో ‘ఇడ్లీ, వడా, సాంబార్ రామ్ చరణ్ ఎక్కడున్నావ్?’ అంటూ చెర్రీని పిలిచారు. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ జైదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. చరణ్ ను ఇండ్లీ సాంబార్ అంటూ షారుక్ పిలవడం నచ్చలేదని కామెంట్ చేసింది. ఇది కాస్తా వైరల్ అవ్వడతో.. బాద్ షాపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

షారుక్ ఖాన్ సరదాగానే అలా పిలిచాడేమో తెలియదు కానీ, అంత పెద్ద స్టార్ హీరోను ఇడ్లీ వడా అంటూ సంబోధించడం సరికాదని, ఇది ఆస్కార్ వేదిక వరకూ వెళ్లిన రామ్ చరణ్ ను అవమానించడమే అవుతుందని అభిమానులు మండిపడుతున్నారు. సౌత్ ఇండియా అంటే షారుక్ కు అంత చులకన భావం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే షారుఖ్ ఖాన్ అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు అదే వేదిక వద్ద రజనీకాంత్ కూడా ఉన్నారు. ఆయన తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ తో కలిసి అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వెళ్ళారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కు షారుఖ్ ఖాన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో లుంగీ డ్యాన్స్ పాటతో ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. తలైవర్ సైతం బాలీవుడ్ హీరో అంటే ఇష్టపడతారు. సౌత్ జనాలందరూ షారుఖ్ కు చాలా విలువ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ ముందే.. తమిళులు ఎంతో ఇష్టపడే ఇడ్లీ వడ సాంబార్ లను రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని పిలవడానికి ఉపయోగించారు కింగ్ ఖాన్. దీనికి సౌత్ ఫ్యాన్స్ మాదిరిగానే రజనీ కూడా నొచ్చుకుని ఉంటారనే కామెంట్లు వినిపిస్తాయి. షారూక్ అలా చులకన భావంతో ఇడ్లీ వడ సాంబార్ పదాలను వాడటం సరికాదని రజనీ అప్సెట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ అవమానించలేదని, తన సినిమాలోని ఫేమస్ డైలాగ్ మాత్రమే చెప్పారని ఆయన అభిమానుల ఓ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. షారుఖ్ నటించిన ‘వన్ 2 కా 4’ మూవీలో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి షారూక్ మాట్లాడుతూ.. "ఇడ్లీ, వడ, సూపర్ స్టార్ రజినీకాంత్" అంటూ డైలాగ్ చెప్తాడు. ఇక్కడ అదే డైలాగ్ ను అంబానీ ఈవెంట్లో చరణ్ ను పిలిచేటప్పుడు ఉపయోగించారని.. రజినీ ప్లేస్ లో రామ్ చరణ్ పేరు పెట్టి పిలిచారని బాద్ షా ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. షారుక్ గతంలో పలు ఇంటర్వ్యూలో చరణ్ పై పొగడ్తలు కురిపించిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.