రోజువారీ కూలీతో పొట్ట పోషించుకున్న హీరో
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. అతడి బాల్యం కడు పేదరికంలో గడిచింది. తల్లి చనిపోయాక ఇంటిని నడిపించే బాధ్యత అతడి భుజాలపై పడింది.
By: Tupaki Desk | 1 May 2025 3:00 AMఒకప్పుడు వడ్రంగిగా, దినసరి కూలీ అందుకుని పొట్ట పోషించుకున్న ఒక వ్యక్తి ఆ తర్వాత భారతీయ సినీపరిశ్రమలో ప్రవేశించాడు. తనదైన యూనిక్ స్టైల్ తో నటుడిగా శిఖరం ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరిగా సత్తా చాటుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఆయనలో దూకుడు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రల్లో నటిస్తున్నాడు.
నిజానికి అతడు వడ్రంగ వృత్తి లో ఉండగానే పని లేనప్పుడు రోజు వారీ కూలీకి వెళ్లాడు. తర్వాత బస్ కండక్టర్ అయ్యాడు. కండక్టర్ గా ఉన్నప్పుడే అతడిలోంచి నటుడయ్యే లక్షణాలు బయటపడ్డాయి. అతడు ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. కచ్ఛితంగా అది అందరి అభిమాన కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. 12 డిసెంబర్ 1950న బెంగళూరులోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. అతడి బాల్యం కడు పేదరికంలో గడిచింది. తల్లి చనిపోయాక ఇంటిని నడిపించే బాధ్యత అతడి భుజాలపై పడింది.
ఇంటిని నడపడానికి రజనీకాంత్ కూలీగా పనిచేశాడు. తరువాత బెంగళూరులో బస్ కండక్టర్‌గా చేరాడు. కానీ నటుడవ్వాలనేది అతని చిన్ననాటి కల. దానిని నెరవేర్చుకునేందుకు స్టేజీ డ్రామాలు ఆడాడు. కుటుంబం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా తన కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తన స్నేహితుడు సాయం చేసాడు. ఒక వార్తా పత్రికా ప్రకటనలో నటశిక్షణ సంస్థ గురించి తెలుసుకుని అక్కడ నటనా కోర్సు చేరాడు. అంతకుముందే కన్నడ నాటకరంగంలో పాపులరయ్యాడు. స్టేజీ డ్రామాలతో పాపులరయ్యాడు. మహాభారతంలోని దుర్యోధనుడిగా అతడి నటనకు ప్రశంసలు దక్కాయి.
ఆ తర్వాత కోలీవుడ్ లో నటుడయ్యాడు. తమిళ సినీరంగంలో ప్రవేశించే ముందే తమిళం నేర్చుకున్నాడు. అపూర్వరారంగల్ తో నటుడిగా కోలీవుడ్ లో ఆరంగేట్రం చేసాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ఓ కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ఐదు దశాబ్ధాల హిస్టరీలో రజనీ సాధించినది ఏమిటో ప్రజలందరికీ తెలుసు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ రంగాల్లో అతడు నటించాడు. 70 ప్లస్ ఏజ్ లో రజనీ రాజకీయాల్లోకి రావాలనుకున్నా ఆయన ఆరోగ్యం సహకరించని సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ తో కూలీ పూర్తయింది. తదుపరి జైలర్ 2లో నటించనున్నారని కథనాలొచ్చాయి.