కేరళలో SPB విగ్రహావిష్కరణలో రజనీ-కమల్ భావోద్వేగం
లెజెండరీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయన పాట, ఆయన గానాలాపన నిరంతరం ప్రజల హృదయాలలో ఉంది.
By: Sivaji Kontham | 4 April 2026 11:44 PM ISTలెజెండరీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయన పాట, ఆయన గానాలాపన నిరంతరం ప్రజల హృదయాలలో ఉంది. ఆయనతో ముడిపడిన ప్రజానుబంధం ఎంతో గొప్పది. ముఖ్యంగా ఆయన పాటలు పాడిన హీరోలందరూ నిరంతరం ఆయనను స్మరిస్తూనే ఉంటారు. ఇప్పుడు దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ కేరళలోని ఎస్పీబీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎస్పీబీతో వారి అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న తీరు హృదయాలను గెలుచుకుంది.
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన గానం కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా కేరళ-పాలక్కాడ్‌లో ఉన్న వి.టి. భట్టాతిరిపాడ్ సాంస్కృతిక సముదాయంలో ఎస్పీబీ జ్ఞాపకార్థం నిర్వహించిన నివాళి కార్యక్రమం సంగీత అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలో భాగంగా ఎస్పీబీ గౌరవార్థం ఏర్పాటు చేసిన 10 అడుగుల భారీ విగ్రహాన్ని ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆవిష్కరించారు. మలయాళ ప్లేబ్యాక్ సింగర్స్ అసోసియేషన్ `సమం` ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీబీ కుమారుడు చరణ్‌తో పాటు గాయకులు హరిహరన్, చిత్ర వంటి ప్రముఖులు పాల్గొని అంజలి ఘటించారు.
ఈ చారిత్రాత్మక వేడుకకు దక్షిణాది దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రత్యేక ఆహ్వానితులుగా నిలిచారు. అయితే తమ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా వారు నేరుగా హాజరు కాలేకపోయినా భావోద్వేగపూరితమైన వీడియో సందేశాల ద్వారా ఎస్పీబీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ తన సందేశంలో ఎస్పీబీ కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదని.. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆనందాన్ని పంచిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. పాలక్కాడ్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు దక్కిన సరైన గౌరవమని రజనీ అభిప్రాయపడ్డారు.
రజనీకాంత్ ఈ సందర్భంగా ఒక అరుదైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకసారి తాను అమెరికా నుండి వస్తుండగా.. తెల్లవారుజామున 1:30 గంటలకు ముంబైలో ఎస్పీబీ విమానం ఎక్కారని చెప్పారు. అప్పట్లో `శంకరాభరణం` పాటలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నాయి. విమానంలోని ప్రయాణికులు ఎస్పీబీని గుర్తించి పాటలు పాడమని కోరగా ఆయన ఏమాత్రం విసుగు చెందకుండా, అలసట లేకుండా దాదాపు ఒకటిన్నర గంటల పాటు విమానం చెన్నై చేరుకునే వరకు పాడుతూనే ఉన్నారని తెలిపారు. అందరినీ సంతోషపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన వ్యక్తిత్వం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని రజనీ భావోద్వేగానికి లోనయ్యారు.
మరోవైపు కమల్ హాసన్ తన సందేశంలో ఎస్పీబీని `అన్నయ్య` అని సంబోధిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేను ఎప్పుడూ ఆయన్ని అన్నయ్య అని పిలిచేవాడిని.. ఆయన నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలిచేవారు. మా మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం కాదు.. అది ఎంతో లోతైన రక్తం పంచుకోని అన్నదమ్ముల బంధం! అని కమల్ పేర్కొన్నారు. కేవలం గొప్ప మనసు ఉన్నవారే గొప్ప కళాకారులు కాగలరని... ఎస్పీబీ దానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నివాళి కార్యక్రమం ద్వారా ప్రజలు ఆయనపై ఎంతటి ప్రేమను కలిగి ఉన్నారో మరోసారి రుజువైందని కమల్ అన్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన `సంగీత మేఘం` కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా గాయకులు పాల్గొని ఎస్పీబీ పాడిన అద్భుతమైన గీతాలను ఆలపించారు. ఈ సంగీత విభావరి పాలక్కాడ్ పరిసర ప్రాంతాల్లో సంగీత హోరును నింపింది. ఎస్పీబీ కుటుంబ సభ్యులు, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ వేడుక కేరళలో జరిగిన అతిపెద్ద సంగీత నివాళి కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఆయన భౌతికంగా లేకపోయినా ఈ విగ్రహం, ఆయన పాటలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అతిథులు తమ ప్రసంగాన్ని ముగించారు.
