Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ బర్త్‌డే వేడుకలో సూపర్‌ స్టార్‌

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2025 7:09 PM IST
డైరెక్టర్‌ బర్త్‌డే వేడుకలో సూపర్‌ స్టార్‌
X

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. రజనీకాంత్‌ పని ఐపోయింది అంటూ విమర్శలు వస్తున్న సమయంలో వచ్చిన జైలర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో అతి పెద్ద సినిమాగా నిలిచింది. అందుకే దర్శకుడు నెల్సన్‌ దిలీప్ వెంటనే సీక్వెల్‌ చేయాలి అనుకున్నాడు. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన జైలర్ కి సీక్వెల్‌ చేసేందుకు రజనీకాంత్‌ సైతం ఆసక్తి కనబర్చాడు. మొదటి పార్ట్‌ ను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే జైలర్ 2 సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

మొన్నటి వరకు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రజనీకాంత్‌ ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే జైలర్ 2 సినిమా షూటింగ్‌కు జాయిన్ అయ్యాడు. కూలీ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన కూలీ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. కూలీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంది. మరో వైపు జైలర్ 2 సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని వారాల్లోనే సినిమా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా జైలర్‌ 2 సెట్స్‌ లో దర్శకుడు నెల్సన్‌ దిలీప్ పుట్టిన రోజు జరిపారు. ఆ సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేశారు. రజనీకాంత్‌ సైతం దర్శకుడు నెల్సన్‌ దిలీప్ యొక్క పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. సన్‌ పిక్చర్స్ వారు ఈ ఫోటోలను అధికారికంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రజనీకాంత్‌ ను సినిమా లుక్‌లోనే చూడవచ్చు. జైలర్‌ పార్ట్‌ 1 లో రజనీకాంత్‌ ఎలా అయితే కనిపించాడో అలాగే ఈ సినిమాలోనూ కనిపించబోతున్నాడని ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో రజనీకాంత్‌ చాలా యాక్టివ్‌గా కనిపించబోతున్నాడని, ఇంతకు ముందు వచ్చిన టీజర్‌ను బట్టి అర్థం అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక జైలర్‌ 1 లో రజనీకాంత్‌ తో పాటు అత్యంత కీలకంగా కనిపించిన వ్యక్తి యోగి బాబు. అతడి కామెడీ వల్ల సినిమా మరో స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందని అంటారు. ఇప్పుడు జైలర్‌ 2 సినిమాలోనూ ఆయన నటించబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో హీరోకి సమానమైన పాత్రను యోగి బాబు పోషిస్తున్నాడు. అంతే కాకుండా యోగి బాబు యొక్క పాత్ర ఫుల్‌ కామెడీతో ఉంటుందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జైలర్ 1 కి ఏమాత్రం తగ్గకుండా జైలర్ 2 ఉంటుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. రూ.500 కోట్ల టార్గెట్‌తో సినిమా విడుదల కాబోతుంది.