Begin typing your search above and press return to search.

బాషా 2, పేట్టా 2'వద్దు.. జైలర్ 2 కి ఓకే ఎలా !

సాధారణంగా సినిమాలకు సీక్వెల్స్ చేయడాన్ని ఇష్టపడని సూపర్ స్టార్ రజనీకాంత్.. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన `జైలర్ 2` విషయంలో మాత్రం ఆ నిబంధనను పక్కనబెట్టారు.

By:  Tupaki Desk   |   12 Oct 2026 8:56 AM IST
బాషా 2, పేట్టా 2వద్దు.. జైలర్ 2 కి ఓకే ఎలా  !
X

సాధారణంగా సినిమాలకు సీక్వెల్స్ చేయడాన్ని ఇష్టపడని సూపర్ స్టార్ రజనీకాంత్.. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన `జైలర్ 2` విషయంలో మాత్రం ఆ నిబంధనను పక్కనబెట్టారు. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అయిన `బాషా` చిత్రానికి సీక్వెల్‌గా `బాషా 2` చేయాలని నిర్మాతలు సంప్రదించినా? కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి పాత్రను విస్తరిస్తూ `పేట్టా 2` చేయాలని ప్రతిపాదనలు వచ్చినా ?ర‌జ‌నీ తిరస్కరించినట్లు స్వయంగా వెల్లడించారు. `జైలర్ 2` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రజనీకాంత్ సాధారణంగా తనకు విజయవంతమైన సినిమాలకు సీక్వెల్స్ చేయడంపై ఆసక్తి ఉండదని స్పష్టం చేశారు.

అయితే `జైలర్` మొదటి భాగం థియేటర్ల తర్వాత ఓటీటీ లో విడుదలైనప్పుడు మళ్లీ చూశానని.. ఆ సినిమా ముగింపులోనే రెండో భాగానికి బలమైన పునాది దాగి ఉందని తనకు అనిపించిందని తెలిపారు.ముఖ్యంగా మొదటి భాగం చివర్లో విలన్ వర్మన్ పాత్రను ముగించే సమయంలో `నా వెనుక చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది. వారు నిన్ను వదిలిపెట్టరు` అని వర్మన్ చెప్పిన డైలాగ్‌ను రజనీ గుర్తు చేసుకున్నారు. వర్మన్ వెనుక అంతర్జాతీయ నేర సామ్రాజ్యం ఉందనే విషయాన్ని దర్శకుడు నెల్సన్ చాలా సూక్ష్మంగా సినిమాలో పొందు పరిచారని, ఆఖరికి పోలీసు అధికారులు కూడా ఆ ముఠా చూసి భయపడతారని వివరించారు.

అలాగే మొదటి భాగంలో వేల కోట్ల విలువైన మూడు కంటైనర్ల బంగారం కథనం ఉందని, అంతటి భారీ మొత్తాన్ని ఏ నేర ముఠా కూడా ఊరికే వదిలేయదని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రకు నాగ్‌పూర్ జైలులో ఉన్న పెద్ద పెద్ద డాన్లు, క్రిమినల్స్ మద్దతుదారులుగా ఉన్నారని ఈ అంశాలన్నీ కలిసి కథ ముందుకు సాగడానికి సహజమైన, బలమైన పునాదిని ఇచ్చాయని పేర్కొన్నారు. మొదటి భాగం విజయవం తమైంది కదా అని ఆ క్రేజ్ ని వాడుకోవడానికి కాకుండా కథ పరంగా సీక్వెల్‌కు పరిపూర్ణమైన విస్కృతి ఉందనే ఉద్దేశంతోనే తానే స్వయంగా దర్శకుడు నెల్సన్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నట్లు రజనీకాంత్ తెలిపారు. దీంతో టైగర్ ముత్తువేల్ పాండియన్ ముగించాల్సిన పని ఇంకా మిగిలే ఉందనే భావనతో ఈ క్రేజీ సీక్వెల్ రూపుదిద్దుకుంద‌న్నారు.

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన `జైలర్ 2` అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి నటులు మరోసారి ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. రజనీకాంత్ స్వయంగా ఆసక్తి చూపించి చేసిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.