Begin typing your search above and press return to search.

నష్టాలు పూడ్చేందుకు లైకాకు ర‌జ‌నీ సాయం?

వేట్టైయన్ ఆర్థిక వైఫల్యం నుండి కోలుకునే ప్రయత్నంలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తమ కోసం మరొక చిత్రంలో నటించడానికి రజనీకాంత్‌ను సంప్రదించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 7:47 AM GMT
నష్టాలు పూడ్చేందుకు లైకాకు ర‌జ‌నీ సాయం?
X

మంచి కంటెంట్ ఉన్నా, న‌ష్టాలు చూసే బాప‌తు సినిమాలు కొన్ని ఉన్నాయి. అదే కేట‌గిరీలోకి చేరిపోయింది వేట్ట‌య్యాన్. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ సినిమా కంటెంట్, కాన్సెప్ట్ గురించి పాజిటివ్ టాక్ వినిపించింది. స‌మీక్ష‌కులు కాన్సెప్ట్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ర‌జ‌నీ ఇలాంటి సామాజిక బాధ్య‌త ఉన్న కాన్సెప్టును ఎంచుకున్నందుకు అత‌డిని పొగ‌డ‌నివారు లేరు. కానీ ఏం లాభం? ఈ సినిమా న‌ష్టాల‌ను కొని తెచ్చింది. దీంతో ర‌జ‌నీకాంత్ ని న‌ష్టం పూడ్చాల్సిందిగా మేక‌ర్స్ సంప్ర‌దించార‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

ర‌జ‌నీకాంత్ న‌టించిన 'వేట్టైయన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన ప్రీక్వెల్ పై సందేహాల‌ను రేకెత్తించింది. రజనీకాంత్-అమితాబ్ బచ్చన్ చాలా కాలం త‌ర్వాత క‌లిసి న‌టించారు. ఇద్ద‌రు లెజెండ్స్ కలయికను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నా కానీ 'వేట్ట‌య్యాన్' బాక్సాఫీస్ విజయం అంతంత మాత్రంగానే ఉంది. వేట్టైయన్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజ‌యం సాధించలేదు. ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి ఫలితం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మునుముందు పోటీ సినిమాలు రిలీజ్ కి రానున్నాయి గ‌నుక ఇది సాధ్యం కాద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ ఫ‌లితంతో ఇప్పుడు ర‌జ‌నీకాంత్ లైకా సంస్థ‌తో మంత‌నాలు సాగించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వేట్టైయన్ ఆర్థిక వైఫల్యం నుండి కోలుకునే ప్రయత్నంలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తమ కోసం మరొక చిత్రంలో నటించడానికి రజనీకాంత్‌ను సంప్రదించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అంతేకాదు తదుపరి ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని త‌గ్గించుకోవాల‌ని కూడా ర‌జ‌నీని లైకా సంస్థ కోరిన‌ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించింది. 2.0, లాల్ సలామ్, దర్బార్ లాంటి భారీ చిత్రాల‌ను లైకా సంస్థ నిర్మించింది. ఇవన్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి. దీంతో మ‌రోసారి వేట్ట‌య్యాన్ ఫ‌లితం నిరాశ‌ప‌ర‌చ‌డంతో లైకా సంస్థ దిగాలైంది. అయితే ర‌జ‌నీకాంత్ తో లైకా భేటీ గురించిన అధికారిక స‌మాచారం ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతానికి జాతీయ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నలే దీనికి ఆధారం.

టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయాన్‌'లో రజనీకాంత్ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఇటీవల విలేకరుల సమావేశంలో ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ పోషించిన పాత్రను మ‌రింత లోతుగా ఆవిష్క‌రించే ర‌హస్యాల‌ను పరిశోధించేదిగా చూపిస్తాన‌ని దానికోసం ప్రీక్వెల్‌ను రూపొందించాల‌నుకుంటున్నాన‌ని తన కోరికను వ్యక్తం చేశాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారడానికి అతియాన్ (ర‌జ‌నీ) ఎలాంటి జ‌ర్నీ చేసాడ‌నేది తెర‌పై చూపించాలని భావిస్తున్నాడు. అతడి ర‌హ‌స్య‌ పరివర్తనకు దారితీసే నేపథ్యాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తాన‌ని తెలిపాడు. 'వేట్టయాన్: ది హంటర్' అనే ప్రీక్వెల్ క‌థ‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆసక్తిని వ్యక్తం చేశాడు. ఫహద్ ఫాసిల్ పాత్రను దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మార్చడాన్ని హైలైట్ చేయడంతోపాటు, కథ బ్యాక్‌స్టోరీని పరిశోధించే ఇతర అంశాల గురించి ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ చ‌ర్చించారు.

హమ్ (1991)లో తర్వాత అమితాబ్ బచ్చన్ రజనీకాంత్‌తో తిరిగి కలవడాన్ని చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఫహద్ ఫాసిల్‌తో పాటు ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక ర‌కంగా ఇది భారీ మ‌ల్టీస్టార‌ర్ కం పాన్ ఇండియ‌న్ సినిమా. కానీ ఈ ఫార్ములా ఎందుక‌నో బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేయ‌డంలో నిరాశ‌ప‌రిచింది. ముఖ్యంగా ఇక్క‌డ ప‌రిశీలించాల్సిన ఒక అంశం ఉంది. ప‌ర‌మ రొటీన్ కంటెంట్ తో వ‌చ్చిన జైల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 500 కోట్లు వ‌సూలు చేస్తే, మంచి కంటెంట్ తో వ‌చ్చిన వేట్ట‌య్యాన్ 200 కోట్ల‌కు ప‌రిమిత‌మైంది. ఇది ఊహించ‌ని నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితం.