రజనీకాంత్ కూలీ LCU లో భాగమా?
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ - యాక్షన్ కింగ్ అర్జున్ కలిసి నటించేందుకు ఆస్కారం ఉందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
By: Tupaki Desk | 9 July 2025 11:52 AM ISTఎవరైనా ఇద్దరు నటులు ఒకే చర్చా వేదికపైకి వస్తే అది దేనికైనా దారి తీయొచ్చు. ఆ ఇద్దరూ కలిసి నటించేందుకు ఆస్కారం లేకపోలేదనే సిద్ధాంతం ప్రకారం.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ - యాక్షన్ కింగ్ అర్జున్ కలిసి నటించేందుకు ఆస్కారం ఉందనే ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేకాదు రజనీకాంత్ నటిస్తున్న `కూలీ` చిత్రం లోకేష్ కనగరాజ్ యూనివర్శ్ (ఎల్.సి.యు) లో భాగం కాబోతోందనే ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి.
దీనికి కారణం తాజాగా నృత్య దర్శకుడు శాండీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్. లోకేష్ కనగరాజ్, అర్జున్ సర్జాలతో కలిసి శాండీ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త పోస్ట్ లో రజనీకాంత్ `కూలీ` ఎల్.సి.యులో భాగం అనే కొత్త సిద్ధాంతానికి దారి తీసింది. తన పుట్టినరోజు సందర్భంగా శాండీ ఈ పోస్ట్ ని షేర్ చేయగా దీనిపై లోకేష్ కనగరాజ్ అభిమానులు విరుచుకుపడ్డారు.
శాండీ తన పోస్ట్ లో వ్యాఖ్యానిస్తూ.. అర్జున్ సర్జా - ఉమాపతి రామయ్య తన బర్త్ డే పార్టీకి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కలయికతో కూలీ చిత్రం ఎల్.సి.యులో భాగం అన్న చర్చకు దారి తీసింది. నెటిజనులు చాలా ఉత్సాహంగా ఈ డిబేట్ లో పాల్గొన్నారు. అభిమానులు `కూలీలో లియో హెరాల్డ్ దాస్?` నటిస్తారు! అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దళపతి విజయ్ నటించిన `లియో`లో హెరాల్డ్ దాస్‌గా నటించిన అర్జున్ సర్జా కూలీలోను నటిస్తే బావుంటుందని అభిమానులు సూచించారు. శాండీ బర్త్ డే పార్టీలో అర్జున్ కనిపించగానే ఈ ఊహాగానాలకు రెక్కలొచ్చాయి.
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు! ఈ ప్రత్యేకమైన రోజు అర్జున్ సర్ ఆశీర్వాదాలు.. మీ ప్రేరణ ప్రతిరోజూ మెరుగ్గా కృషి చేయడానికి నాకు సహాయపడతాయి! సినిమా పట్ల మీ అంకితభావం ఆశావహ కళాకారులకు నిజమైన ప్రేరణ.. అని రాసారు.
అయితే లోకేష్ కనగరాజ్ ఈ వార్తలపై ఎగ్జయిట్ అవుతూ.. నాపై మీకున్న ప్రేమ మంచి విషయాలకు దారి తీస్తుందని అన్నారు. అయితే కూలీ అనేది ఒక స్వతంత్ర కథ అని లోకేష్ కనగరాజ్ ప్రతిసారీ చెబుతూనే ఉన్నారు. ఎల్.సి.యులో కూలీ భాగమా కాదా? అన్నది లోకేష్ స్వయంగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ అదే నిజంగా జరిగితే అది మరిన్ని సంచలనాలకు దారి తీయొచ్చు.
కూలీ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
