'జైలర్ 2'పై క్రేజీ న్యూస్ నిజమేనా?
అయితే తాజా సమాచారం ప్రకారం అది కేవలం ప్రచారం మాత్రమేనని, ఇందులో షారుక్ నటించడం లేదని బాలీవుడ్ వర్గాల కథనం.
By: Tupaki Desk | 19 Jun 2025 4:07 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా 'కూలీ'లో నటిస్తున్నారు. గోల్డ్ క్రైమ్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. శృతిహాసన్, రెబా మోనికా జాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలోని కీలక గెస్ట్ క్యారెక్ట్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్న ఈ సినిమాని ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ రజనీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో పాటు రజనీ 'జైలర్' సీక్వెల్‌లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఎక్కువగా మలయాళ ఆర్టిస్ట్‌లు నటిస్తున్నారు.
అయితే పవర్ ఫేల్ విలన్‌గా దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. తనతో పాటు ఇందులో మరో పవర్‌ఫుల్ అతిథి పాత్ర ఉందట. దాన్ని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అది కేవలం ప్రచారం మాత్రమేనని, ఇందులో షారుక్ నటించడం లేదని బాలీవుడ్ వర్గాల కథనం.
2023లో రజనీ - నెల్సన్ దిలీప్ కుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సైలెంట్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'జైలర్' వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. రూ.650 కోట్లు వసూలు చేసి రజనీ కెరీర్‌లో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జైలర్ 2'పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సీక్వెల్‌పై క్రేజీ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలడంతో రజనీ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారట.
