Begin typing your search above and press return to search.

1000 కోట్ల క్ల‌బ్ కి చివ‌రి అవ‌కాశం ఇదేనా?

కోలీవుడ్ ఇంత‌వ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్లో చేరలేదు. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నప్పటికీ ఆ సక్స‌స్ అంద‌ని ద్రాక్ష‌గానే మారింది.

By:  Tupaki Desk   |   5 July 2025 4:53 PM IST
1000 కోట్ల క్ల‌బ్ కి చివ‌రి అవ‌కాశం ఇదేనా?
X

కోలీవుడ్ ఇంత‌వ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్లో చేరలేదు. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నప్పటికీ ఆ సక్స‌స్ అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ భారీ బ‌డ్జెట్ సినిమాలెన్నో రిలీజ్ అయ్యాయి. కానీ ఏవీ 1000 కోట్ల‌కు దరిదాపుల్లోకి రాలేదు. 500-800 కోట్ల మ‌ధ్య వ‌సూళ్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప‌క్క‌నే ఉన్న టాలీ వుడ్...శాండిల్ వుడ్ మాత్రం 1000 కోట్ల‌ను ఈజీగా కొల్ల‌గొడుతుంటే? మ‌న‌కెందుకు సాధ్యం కాలేద‌ని కోలీవుడ్ ఎన్నో సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఆ స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు.

ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ ఈ మార్కెట్ విష‌యంలో మ‌రింత క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. కోలీవుడ్ ఆప్ష‌న్ లో ర‌జ‌నీకాంత్ ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. అదీ `కూలీ` సినిమాతోనే. 1000 కోట్ల వ‌సూళ్లు అన్న‌ది సాధ్యం కావాలి. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జ‌రిగింది. ఒక్క తెలుగు మార్కెట్ నుంచే 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టాలి.

టార్గెట్ అలా ఫిక్స్ చేసుకునే బ‌రిలోకి దిగుతుంది. ఈసినిమాతో గ‌నుక 1000 కోట్లు సాధించ‌క‌పోతే కోలీవుడ్ కి ఆ మాట అన్న‌ది మ‌ళ్లీ వినిపించే అవ‌కాశం కూడా లేదు. ఎందుకంటే వ‌ర‌ల్డ్ వైడ్ మార్కెట్ ఉన్న‌ది ర‌జ‌నీ కాంత్ ఒక్క‌రికే. `జైల‌ర్` స‌క్సెస్ తో మంచి ఫాంలో ఉన్నారు. ఈసినిమా 700 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాబ‌ట్టి `కూలీ` కి 1000 కోట్ల ఛాన్స్ ఉంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేసినా ఈ రేంజ్ లో బ‌జ్ రాదు. అలాగే ద‌ళ‌ప‌తి విజయ్ కు ఛాన్స్ ఉంది. కానీ ఆయ‌న `జ‌న నాగ‌య‌న్` రిలీజ్ అయిన వెంట‌నే రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతాడు.

మ‌ళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తాడో? అస‌లు చేస్తాడో ? చేయ‌డో కూడా తెలియ‌దు. త‌ల అజిత్ కు అవ‌కాశం ఉంది. కానీ ఆయ‌న‌కు సినిమాలంటే అంత ఆస‌క్తి లేదు. విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఉన్నా? ఆయ‌న మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉంది. ఇప్ప‌ట్లో పుంజుకోవ‌డం క‌ష్ట‌మే. సూర్య‌, కార్తీ, ధ‌నుష్‌, విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్స్ ఉన్నా? ఇప్ప‌ట్లో వాళ్ల‌కు 1000 కోట్ల వ‌సూళ్లు సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో `కూలీ` తోనే కోలీవుడ్ తాడో? పేడో తేల్చుకోవాలి.