పుష్ప 2 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు...!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 8 Aug 2025 1:57 PM ISTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బుక్ మై షో లో సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. బుకింగ్ ప్రారంభించిన వెంటనే ట్రెండ్ మొదలైంది. ఒకానొక సమయంలో గంటకు లక్ష టికెట్లు బుక్ అయిన సందర్భాలు ఉన్నాయి. 24 గంటలకు మిలియన్ టికెట్లు బుక్ అయిన రికార్డ్ సైతం పుష్ప 2 కి దక్కింది. బుక్ మై షో లో ఆ స్థాయిలో టికెట్ల బుకింగ్ మళ్లీ జరగలేదు. హిందీ, తెలుగు, తమిళ్... ఇలా ఏ ఒక్క భాష సినిమాకు కూడా బుక్ మై షో లో రికార్డ్ బ్రేకింగ్ టికెట్లు బుక్ కాలేదు. ఆ స్థాయిలో కాకున్నా ఇన్నాళ్ల తర్వాత కూలీ సినిమాకు అత్యధికంగా టికెట్లు బుక్ అవుతున్నాయి.
ఆగస్టు 14న కూలీ రిలీజ్
బుక్ మై షో లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాకు రికార్డ్ స్థాయి బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. బుకింగ్ ప్రారంభించినప్పటి నుంచి కంటిన్యూస్‌గా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఒకానొక సమయంలో ఈ సినిమాకు గంటకు ఏకంగా 50.8 వేల టికెట్లు బుక్ అయ్యాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో బుకింగ్స్ నమోదు చేస్తున్న సినిమాగా కూలీ నిలిచింది. పుష్ప 2 సినిమా స్థాయిలో ఈ సినిమా టికెట్లు బుక్ అవ్వాలి అంటే సూపర్ హిట్ టాక్ రావాల్సి ఉంది. ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ స్థాయి బుకింగ్స్ అనడంలో సందేహం లేదు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజికల్
కూలీ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ఇతర ప్రమోషనల్ వీడియోలు అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఈ సినిమాలో రజనీకాంత్ మాత్రమే కాకుండా మరింత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా అత్యధికంగా బజ్ ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనే విధంగా అనిరుధ్ రవిచంద్రన్ నమ్మకం కలిగిస్తుంది. రజనీకాంత్ సైతం ఈ సినిమా ఫలితం విషయంలో ఎప్పుడూ లేని విధంగా చాలా పాజిటివ్‌గా ఉండటం మాత్రమే కాకుండా ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. తెలుగు లో సినిమాకు ఈ స్థాయి బజ్ కలగడానికి కారణం ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించడం అనే విషయం తెల్సిందే.
వార్ 2 వర్సెస్ కూలీ
లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ముఖ్యంగా కమల్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో విక్రమ్ వంటి సినిమాను ఇచ్చి ఆయన్ను తిరిగి లైన్‌లో నిలిపిన ఘనత లోకేష్ కనగరాజ్‌కి దక్కుతుంది. అందుకే ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. కూలీ సినిమా ప్రకటించినప్పటి నుంచి హైప్ పెరుగుతూనే వచ్చింది. కూలీ సినిమా విడుదల రోజే బాలీవుడ్ మూవీ వార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వార్ 2 సినిమా కంటే సౌత్ లో ముఖ్యంగా తమిళ్‌లో కూలీ కి బజ్ ఉంది. నార్త్ ఇండియాలోనూ కూలీకి మంచి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు. అందుకే ఈ సినిమాకు బుక్ మై షో లో ఈ స్థాయిలో బుకింగ్ నమోదు అవుతున్నాయి.
