కూలీని కలవరపెడుతున్న 'నో కిడ్స్' నిబంధన.. నష్టం తప్పదా?
దీంతో పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో ఏ రేటెడ్ సినిమాలను ప్రదర్శించారు.
By: Madhu Reddy | 7 Aug 2025 7:06 PM ISTప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ , రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. శృతిహాసన్, ఉపేంద్ర, సత్య రాజ్, అమీర్ ఖాన్, నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన 'వార్ 2' మూవీకి పోటీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ లో సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఇందులో నాగార్జున విలన్ పాత్ర పోషిస్తుండడంతో అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోయాయని చెప్పాలి.
ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ (A ) సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఇప్పుడు అదే సర్టిఫికెట్ ఈ సినిమాకి తలనొప్పిగా మారిందని సమాచారం. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో పిల్లలు ఈ సినిమా చూడకూడదు అనే నిబంధన ఉంది అని అర్థమైపోతుంది. దీనికి తోడు పీవీఆర్ ఐనాక్స్, ఏజిఎస్ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా 18 ఏళ్ల లోపు పిల్లలను ఈ సినిమాకు తీసుకురావద్దు అని ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం.. ఇప్పుడు రజనీకాంత్ అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా పిల్లల్ని థియేటర్లలోకి అనుమతించడం సాధ్యం కాదు అని స్పష్టం చేయడంతో అటు టీనేజ్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేయబోతోంది.
దీంతో పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో ఏ రేటెడ్ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు ఇవ్వని ఈ 'నో కిడ్స్' నిబంధన రజనీకాంత్ కూలీ సినిమాకే ఎందుకు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. సింపుల్ గా ఒకే పదం వినిపిస్తోంది. సాధారణంగా రజినీకాంత్ సినిమా అంటేనే చిన్నా పెద్ద తేడా లేకుండా తండోపతండాలుగా థియేటర్ కి తరలివస్తారు. ఆ సమయంలో చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. పైగా వారిని వెనక్కి పంపించడం మరింత తలనొప్పిగా మారుతుంది. అదేదో ముందే చెబితే ఏ గొడవ ఉండదని ఇలా ప్రకటన ఇస్తున్నారు అని కూడా మరి కొంతమంది క్లారిటీ ఇస్తున్నారు.
ఏది ఏమైనా 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసే ఆస్కారం పూర్తిగా లేదని చెప్పవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లు వెతుక్కోవడం తప్ప వీరికి వేరే మార్గం కూడా లేదు అని చెప్పవచ్చు. వాస్తవానికి మల్టీప్లెక్స్ తో పోల్చుకుంటే చాలామంది సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూడడానికి ఇష్టపడరు. అందులో భాగంగానే ఇప్పుడు నిర్మాతలకి కూడా కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
దీనికి తోడు కూలీ సినిమా నో కిడ్స్ నిబంధన వార్ 2 చిత్రానికి ప్లస్ కానుంది అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి వార్ 2 లో కూడా వైలెన్స్ ఉన్నప్పటికీ.. దానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. కాబట్టి అక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా సినిమా చూడొచ్చు. ఇప్పుడు రజనీకాంత్ మూవీకి ఇలాంటి నిబంధన పెట్టడంతో అటు అభిమానులు ఇటు చిత్ర నిర్మాతలు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.
