వచ్చే ఏడాది భారీ సినిమా.. అగ్ర హీరోతో రాజేష్ దండా ప్లాన్!
టాలీవుడ్‌లో ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు రాజేష్ దండా
By: M Prashanth | 19 March 2026 11:21 AM ISTటాలీవుడ్‌లో ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు రాజేష్ దండా. హాస్య మూవీస్ బ్యానర్‌పై విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మార్చి 19న ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రాజేష్, తన కెరీర్ ప్రయాణం, అలాగే రాబోయే ఆసక్తికర ప్రాజెక్టుల గురించి పలు విషయాలను పంచుకున్నారు.
ఈ ఏడాది తన పుట్టినరోజు ఉగాది రోజే రావడం చాలా సర్ ప్రైజింగ్‌గా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాజేష్ దండా ప్రయాణం సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి మొదలై డిస్ట్రిబ్యూషన్ వైపు మళ్లింది. 'స్వామి రారా' సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా మారి, ఆ తర్వాత అనిల్ సుంకర గారి దగ్గర ప్రొడక్షన్ లో మెలకువలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. 'నాంది' సినిమాతో నిర్మాతగా మారి, కథలో కొత్త పాయింట్ ఉంటేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తానని స్పష్టం చేశారు.
డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న అనుభవం వల్ల ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏది అవ్వదు అనే అవగాహన తనకు స్క్రిప్ట్ సెలెక్షన్ లో చాలా హెల్ప్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అల్లరి నరేష్‌తో చేస్తున్న సినిమా గురించి రాజేష్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలిపారు. 'నాంది', 'బచ్చలమల్లి' వంటి సీరియస్ సినిమాల తర్వాత నరేష్ గారు మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.
వచ్చే నెలలో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సంయుక్త ప్రధాన పాత్రలో వస్తున్న “బ్లాక్ గోల్డ్” చిత్రం భారీ స్కేల్ లో రూపొందుతోందని, గన్ వాడే విలన్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఈ కొత్త తరహా యాక్షన్ డ్రామా జూన్ లేదా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. గతంలో వచ్చిన ‘బచ్చలమల్లి’, ‘మజాకా’ సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషమని రాజేష్ అన్నారు.
ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా, ప్రతిరోజూ సెట్స్‌లో ఉండి బడ్జెట్ కంట్రోల్ చేయాలని ఆయన సూచించారు. కొత్త దర్శకులతో పని చేస్తూ, ప్రొడక్షన్ లో స్వయంగా ఇన్వాల్వ్ కావడం వల్లే తాను తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలుగుతున్నానని వివరించారు. ఈటీవీ విన్ తో కలిసి ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా కోర్ట్ రూమ్ డ్రామాను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తు ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఈ నెల 27న ఆది సాయికుమార్ సినిమా ప్రారంభం కానుంది. అలాగే అల్లు శిరీష్‌తో సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అడివి శేష్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని, 'సామజవరగమన' సీక్వెల్ కోసం ప్రస్తుతం రైటర్స్ కథ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది తమ బ్యానర్ నుంచి ఒక అగ్ర హీరోతో భారీ సినిమా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. ఇక తనకు 'గులాబీ', 'నిన్నే పెళ్లాడతా' తరహాలో ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీ చేయాలనేది డ్రీమ్ అని తన మనసులో మాటను బయటపెట్టారు.
చిన్న సినిమాల నిర్మాతలకు ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉండాలని, కేవలం సినిమా తీయడమే కాకుండా రిలీజ్ ప్లానింగ్ కూడా ముందే చేసుకోవాలని రాజేష్ సలహా ఇచ్చారు. ఓటీటీలు సొంతంగా ప్రొడక్షన్ లోకి వస్తే లోకల్ ప్రొడ్యూసర్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే, వారితో కలిసి పని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
