Begin typing your search above and press return to search.

న‌టుడిగా అదే అతి పెద్ద గుర్తింపు!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన నటకిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు

By:  Sravani Lakshmi Srungarapu   |   11 March 2026 1:29 PM IST
న‌టుడిగా అదే అతి పెద్ద గుర్తింపు!
X

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన నటకిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారత కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కత్తి కాంతారావు జాతీయ పురస్కారం- 2025 కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని రాజేంద్ర ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.

5 త‌రాల హీరోల‌తో క‌లిసి ప‌ని చేసే అదృష్టం

అవార్డు స్వీకరించిన త‌ర్వాత మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ న‌టుడిగా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇండ‌స్ట్రీలో న‌టుడిగా దాదాపు 48 ఏళ్ల ప్రయాణం సాగిందని, ఈ కాలంలో ఐదు తరాల హీరోలతో కలిసి పని చేసే అరుదైన అవకాశాన్ని పొందినట్లు చెప్పారు. తన కెరీర్‌లో అనుభవించిన ప్రతి క్షణం ఎంతో అమూల్యమని, ప్రేక్షకుల ప్రేమే తనను ఇంత దూరం తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ క‌ళ్లు.. కాంతారావు తిల‌కం

తెలుగు సినిమా చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించిన మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి కూడా ఆయన ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. టాలీవుడ్‌కు వారు రెండు కళ్లు లాంటి వారని చెప్పిన రాజేంద్ర ప్ర‌సాద్, కత్తి కాంతారావు టాలీవుడ్ కు తిలకంలా నిలిచారని చెప్పారు. వారి డెడికేష‌న్, కృషి తర్వాతి తరాలకు మార్గదర్శకమని ఆయన అభిప్రాయపడ్డారు.

నార‌దుడు అంటే ఇప్ప‌టికీ ఆయ‌నే గుర్తొస్తారు

ప్రత్యేకంగా కత్తి కాంతారావు నటనను గుర్తుచేసుకుంటూ ఆయన పలువురు పాత్రల్లో చూపిన ప్రతిభను కొనియాడారు. ముఖ్యంగా ల‌వ‌కుశ సినిమాలో లక్ష్మణుడిగా ఆయన చూపిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరంగా నిలిచిపోయిందని అన్నారు. అలాగే నారదుడి పాత్ర అంటే ఇప్పటికీ చాలామందికి కాంతారావే గుర్తుకు వస్తారని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

నాకు ఆ అర్హ‌త ఉంది

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు తన సినిమాలను చూసి కొంతసేపైనా జీవితంలోని కష్టాలను మర్చిపోతే, అదే తనకు నటుడిగా లభించిన అతిపెద్ద గుర్తింపని రాజేంద్ర ప్రసాద్ ఎమోష‌న‌ల్ గా చెప్పారు. ప్రేక్షకుల నవ్వులు, అభినందనలు తన ప్రయాణానికి అసలైన బల‌మ‌ని, ఇలాంటి పురస్కారాలు అందుకోవడం తనకు గౌరవంగా ఉందని, ప్రేక్షకుల ప్రేమతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రేక్షకులు త‌న‌ నటనలో ఆనందం కనుగొంటున్నంత కాలం తాను నటుడిగా కొనసాగుతాన‌ని, అలాంటి ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి పురస్కారాలు స్వీకరించే అర్హత నాకు ఉందని భావిస్తున్నాన‌ని ఆయన చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.