అవార్డు కంటే అవకాశం గొప్పది
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల అందుకున్న ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం సినీ వర్గాల్లో విశేష చర్చకు దారితీస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 8:09 AM ISTప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల అందుకున్న ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం సినీ వర్గాల్లో విశేష చర్చకు దారితీస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చేసిన కామెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవార్డు కంటే తనకు లభించిన అవకాశాలే ఎంతో విలువైనవని, ప్రజల ప్రేమే తనకు అసలైన గుర్తింపని ఆయన స్పష్టం చేశారు.
పద్మశ్రీ పురస్కారం ఆలస్యంగా వచ్చినా తనకెలాంటి బాధ లేదని, తనకు దక్కిన అవకాశం, ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ... ఆ అవార్డు కంటే ఎంతో గొప్పవని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తనకు అవార్డు ఆలస్యంగా వచ్చిందని చాలామంది అభిమానులు చెప్పడం వారి ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. అయితే, తాను ఎప్పుడూ అవార్డుల కోసం కాకుండా మంచి పాత్రల కోసం మాత్రమే పనిచేశానని చెప్పారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న ఆయన, దర్శకులు బాపు, జంధ్యాల, వంశీ వంటి దిగ్గజాలు తన కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించారని అన్నారు. వారి నమ్మకం, ప్రేక్షకుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. ఐదు తరాల ప్రేక్షకులను అలరించే అవకాశం తనకు దక్కడం జీవితంలో గొప్ప వరమని చెప్పారు.
అలాగే తనపై వచ్చే విమర్శలపైనా రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. ప్రతి తెలుగు ఇంట్లో సభ్యుడిలా ఉన్న తననే కొందరు తప్పుగా అర్థం చేసుకుంటే... అది వారి దురదృష్టం అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల ప్రేమ, అభిమానమే తనకు నిజమైన అవార్డని, అందుకే ఎలాంటి అపోహలు తనను ప్రభావితం చేయవని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికీ కొత్త తరానికి చెందిన డైరెక్టర్లు తన కోసం విభిన్నమైన పాత్రలు రాస్తుండటం ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను ఎప్పుడూ రిలాక్స్ అయ్యే మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాదని, నటుడిగా ఇంకా ఎన్నో మంచి పాత్రలు చేయాలనే తపన తనలో ఉందని చెప్పారు. ఫ్యూచర్‌లో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే పాత్రలతో ముందుకు వస్తానని హామీ ఇచ్చారు.
