రాజేంద్రప్రసాద్ నోట మళ్లీ బూతు మాట
దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు వ్యక్తులు.. వయసుతో పాటు వచ్చే చాదస్తం వల్లో ఏమో కానీ.. బహిరంగ వేదికల్లో అదుపు తప్పి మాట్లాడి తమ ప్రతిష్ఠను దెబ్బ తీసుకుంటూ ఉంటారు.
By: Tupaki Desk | 2 Jun 2025 1:53 AM ISTదిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు వ్యక్తులు.. వయసుతో పాటు వచ్చే చాదస్తం వల్లో ఏమో కానీ.. బహిరంగ వేదికల్లో అదుపు తప్పి మాట్లాడి తమ ప్రతిష్ఠను దెబ్బ తీసుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఊహించిన స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. దివంగత చలపతిరావు ఒక సినిమా ఈవెంట్లో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ 'రాబిన్ హుడ్' ఈవెంట్లో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి 'దొంగముం#డా కొడుకు' అంటూ సరదాగా అన్న మాట వివాదానికి దారి తీసింది. దానిపై తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఐతే ఆ ఉదంతం తర్వాత ఆయన జాగ్రత్త పడతారు అనుకుంటే.. ఇప్పుడు ఇంకా తీవ్రమైన బూతు మాటను స్టేజ్ మీద అనడంతో కొత్త వివాదం మొదలైంది.
సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. తన స్పీచ్ మధ్యలో కింద ఉన్న కమెడియన్ ఆలీని ఉద్దేశించి తీవ్రమైన మాట వాడారు. తమ మధ్య క్యాజువల్‌గా ఎలాంటి మాటలుంటాయో చెబుతూ.. 'లం..కొడకా' అనేశారు రాజేంద్ర ప్రసాద్. ఈ మాటకు ఆలీ సహా నవ్వుతూ ఉండిపోయారు కానీ.. ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
రాజేంద్ర ప్రసాద్‌కు ఆలీ ఎంత క్లోజ్ అయినా కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నపుడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు. కానీ బహిరంగ వేదికలో సరదాగా కూడా ఇలాంటి మాట వాడడం తీవ్ర అభ్యంతరకరమే. ఆల్రెడీ వార్నర్ ఉదంతంలో అంత విమర్శలు ఎదుర్కొని, క్షమాపణలు చెప్పిన వ్యక్తి.. కొన్ని రోజుల వ్యవధిలో మళ్లీ ఇంత తీవ్రమైన మాట వాడడంతో ఆయనకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత తప్పట్లేదు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి క్షమాపణ చెప్పక తప్పేలా లేదు. ఆయన్ని ఇకపై ఈవెంట్లకు పిలిచి మైక్ ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తేలా ఉంది.
