Begin typing your search above and press return to search.

క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్..కానీ!

ఒకప్పటి తెలుగు స్టార్ హీరో కాంతారావుని ప్రశంసించే క్రమంలో, ఎంజీఆర్ ని చిన్నబుచ్చేలా మాట్లాడటం తమిళ తంబీల ఆగ్రహానికి కారణమైంది.

By:  Madhu Reddy   |   13 March 2026 5:38 PM IST
క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్..కానీ!
X

తెలుగు చిత్ర పరిశ్రమలో నటకిరీటిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. తమిళ ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒకప్పటి తెలుగు స్టార్ హీరో కాంతారావుని ప్రశంసించే క్రమంలో, ఎంజీఆర్ ని చిన్నబుచ్చేలా మాట్లాడటం తమిళ తంబీల ఆగ్రహానికి కారణమైంది. దీంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో, రాజేంద్రప్రసాద్ స్పందించి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

నోరు జారిన నటుడు.. తమిళ తంబీల ఆగ్రహం:

అసలేం జరిగిందంటే.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, అలనాటి నటుడు కాంతారావు కత్తియుద్ధాల గురించి గొప్పగా చెప్పారు. ఆ క్రమంలోనే "కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవారు.. ఎంజీఆర్ కి కాంతారావు అంటే ఉ*చ్చ" అంటూ అనుకోకుండా ఒక కామెంట్ చేశారు. ఈ మాటలు విన్న తమిళ ప్రేక్షకులు, ఎంజీఆర్ అభిమానులు మండిపడ్డారు. ఎంజీఆర్ వంటి మహోన్నత వ్యక్తిని మరొకరితో పోల్చి తక్కువ చేయడం తగదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం అభిమానులే కాదు, తమిళ నటులు విశాల్, నాజర్ కూడా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విశాల్ డిమాండ్.. రంగంలోకి దిగిన రాజేంద్రప్రసాద్:

తమిళ నటుడు విశాల్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా స్పందించారు. ఎంజీఆర్ ప్రతి తమిళుడి గుండెల్లో ఒక దేవుడితో సమానమని, అలాంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం దిగ్భ్రాంతి కలిగించిందని విశాల్ అన్నారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితిని గమనించిన రాజేంద్రప్రసాద్, తమిళంలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "నేను కూడా ఎంజీఆర్ ని దైవంలా భావిస్తాను. కాంతారావుని పొగిడే క్రమంలో నోరు జారాను తప్ప, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు" అని వివరణ ఇచ్చారు.

వివాదం చల్లారేనా? నటుడి ఆవేదన:

తాను చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎంజీఆర్ సీఎంగా ఉండేవారని, తమ నటనను చూసి అభినందించేవారని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిని విమర్శించే ధైర్యం తనకు లేదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఇకపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని కూడా హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజేంద్రప్రసాద్ వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.. మరి ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుందో లేదో చూడాలి.. అయితే ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. తన మాటలపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆయన తెలుగులో క్షమాపణలు చెప్పకుండా తమిళ్లో క్షమాపణలు చెప్పారు.