సునీల్ కూతురికి పునర్జన్మనిచ్చిన హీరో రాజశేఖర్..
చిత్ర పరిశ్రమలో ఎంతోమంది.. డాక్టర్లము కాబోయి నటులమయ్యామంటూ ఇప్పటికే అభిమానులతో తమ విషయాలను పంచుకున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 25 April 2026 1:00 AM ISTచిత్ర పరిశ్రమలో ఎంతోమంది.. డాక్టర్లము కాబోయి నటులమయ్యామంటూ ఇప్పటికే అభిమానులతో తమ విషయాలను పంచుకున్న విషయం తెలిసిందే.. అయితే వాళ్ళు ఒకవైపు డాక్టర్ వృత్తి కొనసాగిస్తూనే మరొకవైపు హీరోగా, హీరోయిన్గా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక హీరో కమెడియన్ సునీల్ కూతురుకి పునర్జన్మని ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్.
సునీల్ కూతురుకి పునర్జన్మ నిచ్చిన రాజశేఖర్..
కేవలం కెమెరా ముందు హీరో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా ఎంతోమందికి ప్రాణం పోసిన వైద్యుడు కూడా.. అలాంటి ఈయన ఇటీవల శర్వానంద్ తో కలిసి బైకర్ సినిమా చేసి గట్టి కం బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ లభించడంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రాజశేఖర్.. ఒకవైపు కెరియర్ విషయాలను పంచుకుంటూనే మరొకవైపు పాత విషయాలను మళ్లీ నెమరు వేసుకున్నారు. అందులో భాగంగానే తాను కమెడియన్ సునీల్ కూతురి విషయంలో చేసిన పని గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ప్రతి యేటా నాతో అలా చేయిస్తారు..
అసలు విషయంలోకి వెళ్తే.. కొన్ని సంవత్సరాల క్రితం.. ప్రముఖ కమెడియన్ సునీల్ కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమంగా మారింది. ఆ సమయంలో ఎంతో మంది డాక్టర్లను కలిశారు. తీవ్రమైన ఆస్తమా అటాక్ తో అపస్మారక స్థితిలో నా దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయికి ఒక 17 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయికి అత్యవసర చికిత్స అందించి ప్రాణం పోసాను.. దానికి గుర్తుగా ఆ పాప ప్రతి ఏటా నాతో కేక్ కట్ చేయిస్తుంది అంటూ తెలిపారు రాజశేఖర్ . నటుడిగా ఎంత బిజీగా ఉన్నా వీలైతే డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలని ఉంది అంటూ ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదే విషయంపై డాక్టర్ గా తాను ప్రాక్టీస్ చేసిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు.
నటనతో పాటు క్లినిక్ కూడా..
రాజశేఖర్ మాట్లాడుతూ.." నేను హౌస్ సర్జన్ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అప్పుడు చెన్నైలో అన్నా నగర్ లో ఉండే వాళ్ళం. నా పేరు మీద ఒక బోర్డు పెట్టి ఇంట్లోనే నేను క్లినిక్ కూడా పెట్టుకున్నాను. మా ఇంటి నుంచి కొంచెం దూరంలో అంజిగరై అనే ఒక ఫేమస్ ప్లేస్ ఉండేది. అక్కడ కూడా నేను ప్రాక్టీస్ చేశాను. సాయంత్రం సమయంలో అక్కడ అందుబాటులో ఉండేవాడిని. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నేను ఇంట్లోనే చూస్తాను. అలా ఒకరోజు ఎమర్జెన్సీ వచ్చింది . నోట్లో నుంచి నురగ వస్తూ.. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఒక 17 ఏళ్ల అమ్మాయిని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆమెకు ఆస్తమా ఉంది. కండిషన్ చూస్తే చెప్పలేని పరిస్థితి. అదృష్టం ఏమిటంటే ఆ అమ్మాయి చికిత్సకు అవసరమయ్యే ఇంజక్షన్ నా దగ్గర ఉంది. మామూలుగా అలాంటి ఇంజక్షన్స్ నేను ఇంట్లో పెట్టుకోను .
నాడు ఆ జాగ్రత్త.. నేడు ఒక ప్రాణానికి ఊపిరి పోసింది..
అవసరం కోసం పెట్టుకున్న ఆ ఇంజెక్షన్ ను వెంటనే ఆ అమ్మాయికి ఇచ్చాను. కొన్ని నిమిషాల్లోనే ఆ అమ్మాయికి బెటర్ అయ్యింది. గంటలోనే లేచి కూర్చొని మాట్లాడింది కూడా.. ఇక ఆ కుటుంబం నాకు ఎప్పటికీ థాంక్స్ చెప్తూనే ఉంటారు.. అప్పటినుంచి అదే రోజున ప్రతి ఏడాది వాళ్లు నా దగ్గరకు వచ్చి కేక్ కట్ చేయించి, స్వీట్లు చాక్లెట్ ఇచ్చి వెళ్తారు. ఇప్పటికే ఎంతోమందికి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాను " అంటూ రాజశేఖర్ తెలిపారు.
