Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ గుట్టుపై జక్కన్న లాజిక్

బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2024 2:17 PM GMT
ప్రమోషన్స్ గుట్టుపై జక్కన్న లాజిక్
X

బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర స్థాయినే కాదు.. ఇండియన్ మూవీ స్థాయిని ఒక్కసారిగా పెంచేశారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. యావత్ ప్రపంచానికి టాలీవుడ్ సత్తా ఏంటో చూపించారు. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బ్రేక్ చేశారు. కొత్తవి ఎన్నో సృష్టించారు. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇప్పుడు బాహుబ‌లి మూవీ యానిమేటెడ్ వెర్ష‌న్ తో త్వరలోనే ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు.

అయితే ఏ సినిమాకు అయినా ప్రమోషన్ చాలా ముఖ్యం. అందుకోసం రిలీజ్ కు కొద్ది రోజుల ముందు నుంచి మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. ఆడియన్స్ దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అందుకు గాను పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తారు. రాజమౌళి కూడా అలానే చేస్తారు. అద్భుతమైన మేకింగ్‌ ఎంత ముఖ్యమో.. దానికి తగ్గట్టు ప్రమోషన్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతారు.

అందుకే తన చివరి మూవీ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం రూ.5 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ బాహుబలి ప్రమోషన్లకు మాత్రం ఆయన ఎలాంటి ఖర్చు పెట్టలేదట. కేవలం మౌత్ టాక్ వల్ల ఆ మూవీకి మంచి పబ్లిసిటీ అయిందట. ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా తెలిపారు. బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.

"బాహుబలి మూవీ ప్రమోషన్ల కు మేం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ పేపర్ లేదా వెబ్‌ సైట్ కు కూడా డబ్బులు ఇవ్వలేదు. కానీ సినిమా కోసం చాలా హోంవర్క్ చేశాం. అనేక వీడియోలు, పోస్టర్లు సిద్ధం చేశాం. రిలీజ్ కు ముందే పాత్రలను కూడా పరిచయం చేశాం. అయితే మేకింగ్ వీడియో షేర్ చేశాక మంచి ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం కేవలం మేం మా మైండ్ కు మాత్రమే ఖర్చు పెట్టాం" అని తెలిపారు రాజమౌళి.

"చెప్పాలంటే ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా పరిస్థితి ఉంటుంది. మార్కెటింగ్ పై పూర్తి దృష్టి పెడతాం. ఆడియన్స్ కు కొత్తగా ఎలా అందించాలో ఆలోచిస్తాం. నా సినిమాల నుంచి ఎప్పుడూ ఎక్కువగా అస్సలు ఆశించను. అలా అని తక్కువ కూడా ఆశించను. నేను తెరకెక్కించే సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారని ఎప్పుడూ అనుకోను. ఎలాంటి టైమ్ లోనైనా బ్యాలెన్స్ గా ఉంటాను" అని జక్కన్న తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.