Begin typing your search above and press return to search.

బాహుబలి సిరీస్.. జక్కన్న అదెందుకు మిస్ అయ్యారో?

ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా ఈ రెండు చిత్రాలు చేశాయి.

By:  Tupaki Desk   |   3 May 2024 7:27 PM GMT
బాహుబలి సిరీస్.. జక్కన్న అదెందుకు మిస్ అయ్యారో?
X

భారత సినీ పరిశ్రమ దశ, దిశను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టులు మార్చేసిన విషయం తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. ప్రపంచమంతా ఇండియన్ సినీ ఇండస్ట్రీ వైపు ఒక్కసారిగా చూసేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా ఈ రెండు చిత్రాలు చేశాయి.

2015లో వచ్చిన బాహుబలి బ్లాక్‍ బస్టర్ అయితే.. దానికి సీక్వెల్‍ గా వచ్చిన బాహుబలి 2 అనేక రికార్డులను బద్దలుకొట్టింది. రూ.1,000 కోట్ల మార్క్ సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. అనేక రికార్డులు సాధించింది. అందరి మనసుల్లో నిలిచిపోయిన బాహుబలి.. ఇప్పుడు మళ్లీ వస్తోందంటూ జక్కన్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేషన్ సిరీస్ రానున్నట్లు తెలిపారు.

మే 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. మేకర్స్ ఇటీవల ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాహిష్మతి రాజ్యాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని యుద్ధానికి దిగిన రక్త దేవ్ ను బాహుబలి, భల్లాలదేవుడు కలిసి వీరోచితంగా ఎదుర్కోవడాన్ని ట్రైలర్ లో చూపించారు మేకర్స్. రాజమౌళి ప్రకటనతో యానిమేషన్ సిరీస్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్.. ట్రైలర్ చూసి కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

బాహుబలి సినిమాలకు ఈ యానిమేషన్ సిరీస్ ప్రీక్వెల్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. కట్టప్ప వెన్నుపోటు పొడవక ముందే బాహుబలి తన తల్లి శివగామి ఆదేశాల మేరకు మరో యుద్ధానికి వెళ్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. అయితే ట్రైలర్ చూశాక.. యానిమేషన్ క్వాలిటీ బాగాలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్న పిల్లలు చూసే సిరీసుల యానిమేషన్ లా ఉందని చెబుతున్నారు. బాహుబలి ఫేస్ క్రికెటర్ ధోనీ ముఖంలా కనిపిస్తుందని అంటున్నారు.

అయితే బాహుబ‌లి సినిమాను వివిధ రూపాల్లో తీసుకు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ గురించి స్వ‌యంగా జక్కన్న ప్రకటించడంతో అంతా ఇంటర్నేషనల్ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక యానిమేషన్ విషయంలో నిరాశ చెందారు. మరి ట్రైలర్ విషయంలో వచ్చిన కామెంట్లపై మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి.