ధురంధర్ తర్వాత రామాయణ.. మరి వారణాసి?
బాలీవుడ్ లో రెండు పార్టుల సినిమాల ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. రీసెంట్ గా విడుదలైన ధురంధర్ సినిమా రెండు పార్టులుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
By: M Prashanth | 2 April 2026 7:40 PM ISTబాలీవుడ్ లో రెండు పార్టుల సినిమాల ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. రీసెంట్ గా విడుదలైన ధురంధర్ సినిమా రెండు పార్టులుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీ రెండు భాగాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టించాయి. దీంతో పెద్ద కథలను రెండు భాగాలుగా తెరకెక్కించే ట్రెండ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణపై పడింది. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఆ మూవీ ఇప్పటికే రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ద్వారా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ తో ఆ చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో, రెండు భాగాలుగా విడుదల చేయడం సరైన నిర్ణయమని అంతా అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే వారణాసి సినిమా గురించి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఇందులో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. తెలుగు సినీ పరిశ్రమలో సీక్వెల్ ట్రెండ్ ను పాపులర్ చేసిన వ్యక్తి రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసి సంచలనం సృష్టించారు.
ఆ తర్వాత నుంచి పెద్ద కథలు రెండు పార్టులుగా చెప్పే ధోరణి బలపడింది. అయితే రాజమౌళి తన ప్రతి సినిమాను రెండు భాగాలుగా తీస్తారని మాత్రం కాదు. ఉదాహరణకు ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ ఒకే భాగంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. వారణాసి సినిమాపై కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఆ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించే ఆలోచన ఉందా లేదా అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
గతంలో రాజమౌళి ఆ ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా తీసే ఆలోచన లేదని సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే కథ, విజువల్ స్కేల్ ను బట్టి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి, ధురంధర్ విజయంతో ప్రారంభమైన ఆ చర్చ రామాయణతో మరింత బలపడింది. ఇప్పుడు అందరి చూపు వారణాసిపై ఉంది. అది కూడా రెండు భాగాలుగా వస్తుందా? లేక ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది తెలుసుకోవాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
