Begin typing your search above and press return to search.

చైనా- కొరియా కంటే వెన‌క‌బ‌డ్డాం: రాజ‌మౌళి

ఇటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజ‌మౌళి, నాగార్జున స‌హా ప‌లువురు సినీప్ర‌ముఖులు వేవ్స్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   2 May 2025 9:55 AM IST
Rajamouli Speech At WAVES 2025 Summit
X

ముంబై జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌క వేవ్స్ 2025 సంబ‌రాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్స‌వాల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీదిగ్గ‌జాలు ఎటెండ‌వుతున్నారు. ఇటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజ‌మౌళి, నాగార్జున స‌హా ప‌లువురు సినీప్ర‌ముఖులు వేవ్స్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ వేడుక‌ల్లో రాజ‌మౌళి స్పూర్తివంత‌మైన స్పీచ్ తో కట్టిప‌డేసారు. భార‌తదేశంలో ఎన్నో భాష‌లు ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. మ‌న‌కు వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. ఈ చ‌రిత్ర నుంచి ల‌క్ష‌లాది క‌థ‌లు మ‌న‌కు ఉన్నాయి. బిలియ‌న్ క‌థ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. అనంతంగా క‌థ‌లు ఉన్నాయి.. అని రాజ‌మౌళి వ్యాఖ్యానించారు. భార‌తీయ పురాణేతిహాస క‌థ‌ల్ని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేయాలని కూడా రాజ‌మౌళి అన్నారు.

భారతదేశం ఇంకా అంతర్జాతీయ వినోద విఫ‌ణిలో పూర్తిగా స్థిరపడలేదని, అమెరికా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల కంటే వెనుకబడి ఉందని రాజమౌళి ఎత్తి చూపారు. అయితే భారతదేశ వినోద‌రంగం సామర్థ్యంపై త‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు. ప్రపంచానికి దాని కథ చెప్పే సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి దేశానికి సరైన లాంచ్‌ప్యాడ్ మాత్రమే అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మీడియా, వినోదాన్ని ది బెస్ట్ గా మ‌లిచేందుకు WAVES కీలక వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి రాజ‌మౌళి చెప్పిన దాంట్లో వాస్త‌వాన్ని సంగ్ర‌హించాలి. అమెరికా, కొరియా, చైనా నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యే హాలీవుడ్ సినిమాలు బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. కానీ ఇత‌ర దేశాలు దీనిని అందిపుచ్చుకోవ‌డంలో వెన‌క‌బ‌డి ఉన్నాయి. భార‌త‌దేశ వినోద రంగం ఇంకా ఆ స్థాయిని అందుకోలేదు. చైనా జ‌నాభా 140కోట్లు.. భార‌త‌దేశ జ‌నాభా 140కోట్లు కాబ‌ట్టి భార‌త‌దేశం నుంచి మ‌న సినిమా 1000కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగినా చైనా నుంచి అంతే పెద్ద మొత్తం వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది. క‌నీసం ఆ స్థాయికి కూడా ఇంకా చేరుకోలేదు. కొరియా దేశాల్లోను సినిమా ఔత్సాహికుల వ‌ద్ద‌కు భార‌తీయ సినిమాను చేర్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది భార‌తీయ సినిమా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ కి దారి తీస్తుంది.

వేవ్స్ సమ్మిట్ ముఖ్యంగా మీడియా, వినోదం, డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టే లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం. ఈ వేదిక‌పై దిగ్గ‌జాల క‌ల‌యిక కొత్త ఆశ‌ల్ని రేకెత్తిస్తోంది.