Begin typing your search above and press return to search.

మరోసారి జపాన్ లో జక్కన్న హడావుడి.. అదిరిపోయే రెస్పాన్స్!

ఇప్పుడు ఈ డాక్యుమెంటరీను అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఆయనకు మరింత క్రేజ్ ను తీసుకురానుంది.

By:  Tupaki Desk   |   12 April 2025 3:53 PM IST
మరోసారి జపాన్ లో జక్కన్న హడావుడి.. అదిరిపోయే రెస్పాన్స్!
X

ఇండియన్ సినిమా ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు మరోసారి జపాన్ ప్రేక్షకుల మనసులు గెలవడానికి రెడీ అయ్యారు. ‘RRR: బీహైండ్ అండ్ బియాండ్’ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీ మూవీ ప్రమోషన్ కోసం రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయతో కలిసి జపాన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్‌లో ఇప్పటికే RRR సినిమాకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది.

ఇప్పుడు ఈ డాక్యుమెంటరీను అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఆయనకు మరింత క్రేజ్ ను తీసుకురానుంది. ఈ డాక్యుమెంటరీలో RRR సినిమా మేకింగ్ సమయంలో పడ్డ కష్టాలు, సాంకేతిక అద్భుతాలు, నటీనటుల పనితనం, దానికి వెనుక ఉన్న విజన్ ఇలా అనేక విషయాలను చూపించనున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి రుజువవుతోంది.

ఇప్పటికే ప్రీమీయర్ షోలు జపాన్‌లో ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల నుంచి పెద్దసంఖ్యలో స్పందన వస్తోంది. జపాన్‌లో RRR సాధించిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు, స్టోరీటెల్లింగ్ స్టైల్, ఎమోషనల్ హైప్స్‌ అన్నీ జపాన్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ అక్కడ మరింత పెరిగింది. ఇప్పుడు ఆ ఫాలోప్‌గా 'బీహైండ్ అండ్ బియాండ్' ప్రాజెక్ట్ తీసుకురావడం భారీ స్ట్రాటజీగా చెప్పవచ్చు.

కార్తికేయ రాజమౌళి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన గతంలో కూడా నిర్మాతగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి పనితీరును దగ్గరగా చూసిన కార్తికేయ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమా ప్రమోషన్లో దూసుకెళ్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా వచ్చిన వీడియోల్లో జపాన్ ప్రేక్షకులు థియేటర్లలో రాజమౌళిని స్వాగతించడం చూస్తే అది అక్కడ RRR క్రేజ్ ఇంకా తగ్గలేదని స్పష్టమవుతుంది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రధాన పోస్టర్‌ను కూడా రాజమౌళి, కార్తికేయ కలిసి జపాన్‌ మీడియా ముందుగా ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. ఇక రాజమౌళి హడావుడి చూస్తుంటే అతని తదుపరి సినిమా SSMB29కి కూడా అక్కడ ముందుగానే అంచనాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో రెడీ అవుతోంది.