రెమ్యునరేషన్ లో రాజమౌళిని కొట్టింది అతనొక్కడే..
ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు మరోసారి టాప్ ర్యాంకును సాధించాడు
By: Tupaki Desk | 21 April 2025 4:30 PMఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు మరోసారి టాప్ ర్యాంకును సాధించాడు. ఆయన సినిమాలు మాత్రమే కాదు.. ఆయన రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ ని వణికించే రాజమౌళి.. ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా నిలిచాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ సినీ డేటాబేస్ వెబ్సైట్ IMDB వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళే అని స్పష్టం చేసింది. ఆయన ఒక సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ రూ.200 కోట్లు అని పేర్కొంది. ఇది రెమ్యునరేషన్, లాభాల్లో షేర్ రూపంలో కలిపి వచ్చిన మొత్తం అని వివరణ ఇచ్చారు. ఇక మహేష్ బాబు సినిమాకు అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు.
టాప్ స్టార్ హీరోలకన్నా ఎక్కువగా రాజమౌళి తీసుకుంటున్నాడంటే, అది ఆయన క్రేజ్‌కు నిదర్శనం. ఇక వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్న ఆయన ప్రతిష్ఠ ప్రపంచ స్థాయిలో ఉండటంతో.. ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం సహజమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే.. రాజమౌళికి ఈ స్థాయిలో పోటీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
అతను మరెవరో కాదు.. మన టాలీవుడ్ దర్శకుడు సుకుమార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్ప 2 సినిమాతో భారీ రెమ్యునరేషన్ పొందినట్లు సమాచారం. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంచనా. దీంతో సుకుమార్‌కి రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో భాగస్వామ్యంగా దాదాపు రూ.200 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది.
అంటే గణాంకాల పరంగా చూస్తే.. రాజమౌళి కంటే ముందే 200 కోట్ల రెమ్యునరేషన్ మార్క్‌కి సుకుమార్ చేరుకున్నాడని చెప్పవచ్చు. ఇక IMDB నివేదిక ప్రకారం రాజమౌళికి తర్వాత రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఒకొక్కరు రూ.90 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. ఇక రాజ్ కుమార్ హిరానీ రేటు రూ.80 కోట్ల దాకా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
అయితే ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ద్వారా సుకుమార్ మార్కెట్ మరోలెవెల్కి వెళ్లింది. దీంతో తన తదుపరి సినిమా కోసం రామ్ చరణ్‌తో కలిసిపనిచేస్తున్న సుక్కు.. ఈసారి మరింత భారీగా స్కేల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2తో సాధించిన వసూళ్ల స్థాయిని దాటి, కొత్త మార్కెట్లను టార్గెట్ చేస్తూ సుకుమార్ పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇది జరిగితే.. ఆయన తీసుకునే రెమ్యునరేషన్ మరింతగా పెరగొచ్చు.