Begin typing your search above and press return to search.

జక్కన్నను కదిలించి, నవ్వించిన చిన్న సినిమా

ఆయన ఏదైనా సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అంటే కచ్చితంగా అన్ని భాషల్లోనూ మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ సినిమాకు రాజమౌళి రివ్యూ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   20 May 2025 2:06 PM IST
జక్కన్నను కదిలించి, నవ్వించిన చిన్న సినిమా
X

శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్‌ మూవీ 'టూరిస్ట్‌ ఫ్యామిలీ' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 1న విడుదలైన ఈ సినిమాకు తమిళనాట ఊహించని రేంజ్‌లో వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటికే రూ.50 కోట్ల వసూళ్లు దక్కించుకుని రూ.100 కోట్ల వసూళ్లు దిశగా దూసుకు పోతున్న ఈ సినిమాకు రాజమౌళి ట్వీట్‌ మంచి బూస్ట్‌ను ఇచ్చింది. రాజమౌళి సాధారణంగా ఎక్కువ సినిమాలకు రివ్యూలు ఇవ్వరు. ఆయన ఏదైనా సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అంటే కచ్చితంగా అన్ని భాషల్లోనూ మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ సినిమాకు రాజమౌళి రివ్యూ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.


మొన్నటి వరకు టూరిస్ట్‌ ఫ్యామిలీ అనేది ఒక తమిళ సినిమాగా మాత్రమే అందరికీ తెలుసు. తమిళనాడు జనాల వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో కచ్చితంగా చూడాలని అన్ని భాషల ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఎక్కడ ఉంది, ఎలా చూడాలని అప్పుడే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు, సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. రాజమౌళి తో అద్భుతం అనిపించుకున్న ఈ టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా కచ్చితంగా ముందు ముందు వంద కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రాజమౌళి స్పందిస్తూ.... అద్భుతాన్ని చూశాను, టూరిస్ట్‌ ఫ్యామిలీ అద్భుతమైన సినిమా. మనసును కదిలించే సినిమా, అంతే కాకుండా చక్కిలిగింతలు పెట్టే సున్నితమైన కామెడీతో ఈ సినిమా సాగిన తీరు బాగుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథ, కథనం ఆసక్తికరంగా సాగింది. ఎక్కడా బోర్‌ లేకుండా సినిమా నడిచింది. దర్శకుడు అభిషన్‌ జీవింత్ గొప్ప రచన ప్రతిభను కనబర్చాడు. అతడి దర్శకత్వం చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో తాను చూసి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఇలాంటి ఒక గొప్ప, అద్భుతమైన సినిమాను మిస్‌ కావద్దు అంటూ ప్రేక్షకులకు రాజమౌళి సూచించారు.

రాజమౌళి ట్వీట్‌కి దర్శకుడు అభిషన్‌ జీవింత్ కృతజ్ఞతలు తెలియజేశాడు. రాజమౌళి సర్ ట్వీట్‌ చేయడంను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను, నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లు అవి, సినిమాల కోసం గొప్ప ప్రపంచాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఈ రోజు నా పేరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మూమెంట్‌ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. రాజమౌళి గారు ఈ ఫ్యాన్‌ బాయ్‌ డ్రీమ్‌ను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ భావోద్వేగంతో పోస్ట్‌ చేశాడు. టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా చిన్న బడ్జెట్‌ మూవీగా రూపొంది, పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల అయింది. అనూహ్యంగా సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.