నాని నా అంచనాలను ఎప్పుడో దాటేశాడు
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
By: Tupaki Desk | 28 April 2025 10:01 AM ISTనేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న సినిమా హిట్3. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ యూనివర్స్ లో భాగంగా శైలేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
ఈవెంట్ లో భాగంగా ముందుగా అక్కడున్న సూట్స్‌ను రాజమౌళితో అన్‌వీల్ చేయించి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ వేసుకున్న వైట్ బ్లేజర్ ను రాజమౌళి కు ఇచ్చి అక్కడిక్కడే ఆ బ్లేజర్ వేసుకునేలా చేశాడు నాని. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ, నానిని ఎప్పట్నుంచో చూస్తున్నానని, తాను అనుకున్న దానికంటే నాని ఎంతో ముందుకు వెళ్లిపోయాడని అన్నాడు. ఇక్కడితో ఆగకూడదని, నాని మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని రాజమౌళి చెప్పాడు.
హిట్3 నిర్మాతల్లో ఒకరైన ప్రశాంతి గురించి మాట్లాడుతూ ఆమెను ఇండస్ట్రీలో హిట్ మిషన్ గా పిలుచుకుంటామని, ఇప్పటివరకు ప్రశాంతి నుంచి వచ్చిన సినిమాలన్నీ హిట్టేనని, ప్రశాంతికి 100% సక్సెస్ రేట్ ఉందన్నారు. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను గురించి మాట్లాడుతూ అతన్ని తెగ ప్రశంసించాడు రాజమౌళి. సినిమా లీకైనప్పుడు శైలేష్ వ్యవహరించిన తీరు చాలా అభినందనీయమన్నాడు.
ఎవరికైనా సినిమాల నుంచి ఏదైనా లీక్ వస్తే చాలా కోపం వస్తుంది. కానీ శైలేష్ ఈ విషయంపై మాట్లాడిన విధానం తనకు చాలా బాగా నచ్చిందని, హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన మొదటి సిరీస్ తోనే అందరికీ క్యూరియాసిటీ పెరిగిందని, ఇక దాన్నుంచి ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చని అన్నాడు. ఇదిలా ఉంటే హిట్ ఫ్రాంచైజ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్టుగా రావడం సెంటిమెంట్ గా మారింది.
