రాయల్ హాల్‌లో రాజమౌళి హ్యాట్రిక్ కొట్టేనా?
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఇతర విషయాల కారణంగా ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ లో స్క్రీనింగ్‌కి అవకాశం దక్కింది.
By: Tupaki Desk | 22 May 2025 11:15 AM ISTఇండియన్ సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి సాధ్యం కాని ఎన్నో అరుదైన రికార్డ్‌లను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సొంతం చేసుకున్నారు, ఎన్నో గొప్ప సినిమాలను అందించిన బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకులకు సైతం దక్కిన అరుదైన గుర్తింపు, గౌరవం సైతం రాజమౌళికి దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా గురించి ఒకప్పుడు పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారంటే కచ్చితంగా అది రాజమౌళి వల్లే అనడంలో సందేహం లేదు. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో రాజమౌళి పాత్ర కీలకం.
ఎన్నో అరుదైన మైలు రాళ్లను అధిరోహించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను రూపొందిస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు ముందు రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు ప్రఖ్యాత లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో స్క్రీనింగ్ అయ్యాయి. ఆ 150 ఏళ్ల చరిత్ర ఉన్న అతి పురాతన హాల్ లో రాజమౌళి రెండు సినిమాలు కాకుండా మరే ఇండియన్ సినిమా స్క్రీనింగ్ అవ్వలేదు. వరుసగా రాజమౌళి రూపొందించిన బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్క్రీనింగ్ కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు హాజరు అయ్యారు.
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఇతర విషయాల కారణంగా ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ లో స్క్రీనింగ్‌కి అవకాశం దక్కింది. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచి పోయే రికార్డ్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి హ్యాట్రిక్ కొట్టేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా కూడా లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్క్రీనింగ్ అయితే కచ్చితంగా రాజమౌళి రికార్డ్‌ను రాబోయే 50 ఏళ్ల వరకు ఎవరూ కనీసం టచ్ కూడా చేసే అవకాశం ఉండదు. ఇండియన్ సినిమాలు అక్కడ స్క్రీనింగ్ కావడమే గొప్ప విషయం అంటే... వరుసగా మూడు సినిమాలను స్క్రీనింగ్ చేయించగల సత్తా మరే దర్శకుడికి ఉండక పోవచ్చు.
తన గత చిత్రాల మాదిరిగానే రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న SSMB 29 సినిమాను సైతం భారీ ఎత్తున విజువల్ వండర్‌గా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ముఖ్య పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండేళ్ల పాటు మేకింగ్‌కు సమయం తీసుకునే రాజమౌళి ఈ సినిమాను సైతం ఎక్కువ రోజులు షూట్ చేయబోతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
