Begin typing your search above and press return to search.

రాముడి అసలు సిసలు శౌర్యం: వెండితెరపై మహేష్- రణబీర్ పరాక్రమ సమరం

ముఖ్యంగా రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

By:  Sivaji Kontham   |   6 Jun 2026 9:39 AM IST
రాముడి అసలు సిసలు శౌర్యం: వెండితెరపై మహేష్- రణబీర్ పరాక్రమ సమరం
X

శ్రీరాముడు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది శాంతం, సహనం, ఆదర్శ గుణాలు. కానీ ఆయన కేవలం కోదండరాముడు మాత్రమే కాదు, అజేయుడైన రణరాముడు కూడా. శివధనుస్సును అవలీలగా విరిచిననాడే ఆయన శౌర్యం లోకానికి తెలిసింది. వనవాసంలో మాయావులైన రాక్షసులను చీల్చిచెండాడటంలో.. ముల్లోకాలను వణికించిన రావణాసురుడిని రణరంగంలో మట్టికరిపించడంలో రాముడు చూపిన యుద్ధతంత్రం, పరాక్రమం సాటిలేనివి. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ వీర రాముడి శౌర్యాన్ని ఆవిష్కరించేందుకు ఇద్దరు అగ్ర హీరోలు సిద్ధమవుతుండటం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు ఇద్దరు నటులు రాముడి పాత్రలతో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. బాలీవుడ్ నుంచి టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తుండగా.. టాలీవుడ్ నుంచి సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబును శ్రీరాముడి గెటప్‌లో చూపించే బాధ్యతను దర్శకేంద్రుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసుకున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ రాముడిలోని రౌద్ర రూపాన్ని, యుద్ధ కౌశలాన్ని వెండితెరపై ఎలా పండించబోతున్నారనే చర్చ అప్పుడే మొదలైంది.

ముఖ్యంగా రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్ర కథాంశంపై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ఇండస్ట్రీలో చ‌ర్చగా మారింది. ఈ సినిమాలో అత్యధిక భాగం రాముడు - కుంభకర్ణుడి మధ్య జరిగే హోరాహోరీ పోరాటం చుట్టూనే తిరుగుతుందని ఆయన వెల్లడించారు. క్లైమాక్స్ స‌హా ప్ర‌ధాన యుద్ధ‌ ఘట్టంలో వచ్చే ఈ ముప్పై నిమిషాల యుద్ధ సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడమే కాకుండా.. సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందని స్పష్టం చేశారు.

అంతేకాదు షూటింగ్ సెట్స్‌లో మహేష్ బాబును తొలిసారి రాముడి గెటప్‌లో చూసినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని విజయేంద్రప్రసాద్ చెప్పిన‌ మాటలు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. మ‌రోవైపు ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి విల‌క్ష‌ణ‌మైన న‌టుడిని శ్రీ‌రాముడిగా ఆవిష్క‌రించేందుకు నితీష్ తివారీ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ర‌ణ‌బీర్ రాముడి గెట‌ప్ కి ఫ్యాన్స్ లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక నితీష్ రామాయ‌ణం ఆద్యంతం తెర నిండుగా శ్రీ‌రాముడి పాత్ర‌లో క‌నిపిస్తాడు గ‌నుక అది విజువ‌ల్ పండుగ‌ను త‌ల‌పిస్తుంది. ఒకవైపు క్లాసిక్ లుక్‌తో రణబీర్ కపూర్, మరోవైపు రాజమౌళి మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్‌తో మహేష్ బాబు.. ఇద్దరూ రాముడి పరాక్రమాన్ని రెండు భిన్న కోణాల్లో ఆవిష్కరించబోతున్నారు. కేవలం శాంతమూర్తిగానే కాకుండా, దుష్టశిక్షణ చేసే వీర రాముడి అసలు సిసలు శౌర్యాన్ని ఈ చిత్రాలు ఏ స్థాయిలో ఆవిష్కరిస్తాయో చూడాలి.