వరల్డ్ నెం.1తో రాజమౌళి జూమ్ మీటింగ్
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 1 May 2025 10:22 AM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన ఏ పని చేసినా ది బెస్ట్‌గా ఉండాలని అనుకుంటాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ పాట పూర్తి అయిన తర్వాత దాదాపుగా 45 రోజుల పాటు రాజమౌళి షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు అంతా చిల్ అయినా రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉండనున్నారు. తాజాగా వీరిద్దరు హిడియో కోజిమాతో జూమ్ కాల్‌లో మాట్లాడారు.
హిడియో కోజిమా ప్రపంచంలోనే నెం.1 వీడియో గేమ్ క్రియేటర్‌గా చెప్పుకుంటూ ఉంటారు. జపాన్‌కి చెందిన ఈయన వీడియో గేమ్ లెజెండ్ అంటూ సోషల్ మీడియాలో పిలిపించుకుంటూ ఉంటాడు. అలాంటి హిడియోతో రాజమౌళి జూమ్ మీటింగ్‌లో మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఆర్ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో జపాన్‌కి వెళ్లిన సమయంలో రాజమౌళి, హిడియో కోజిమాను కలవడం జరిగింది. ఆ సమయంలో చాలా విషయాలను పంచుకున్నారు. తన సినిమాల్లో హిడియో వర్క్ కోసం అప్పట్లోనే రాజమౌళి అడిగాడని తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి నుంచి రాబోతున్న అతి భారీ సినిమాలో హిడియో ఉండే అవకాశాలు ఉన్నాయి.
హిడియో కోజిమా తో జూమ్ మీటింగ్ నేపథ్యంలో ఆయన మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. సుదీర్ఘంగా సాగిన వీరి వీడియో కాన్ఫిరెన్స్ విశేషాలను బయటకు చెప్పలేదు. కానీ హిడియో మాత్రం తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయతో జూమ్ కాల్ లో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. తక్కువ సమయంలోనే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేష్ బాబు సినిమా కోసం ఆయన వర్క్ చేయడం ఖాయం అంటూ సూపర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఎక్స్ ద్వారా హిడియో కోజిమా షేర్ చేసిన ఫోటోకు రాజమౌళి తనయుడు కార్తికేయ స్పందించాడు. ఈ మీటింగ్ చాలా ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. కార్తికేయ ట్వీట్‌తో అందరూ మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమా స్థాయి పెంచే విధంగా హిడియో కోజిమా వర్క్ ఉంటుందని అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు - రాజమౌళి సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో జపాన్ లెజెండ్రీ గేమర్ తో జూమ్ మీటింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌తో పాటు మొత్తం హాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదిక వరకు వెళ్లారు. దాంతో మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా గురించి అంతర్జాతీయ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఎప్పుడూ రాజమౌళి అందుకోవడంలో విఫలం కాలేదు. ప్రేక్షకుల అంచనాలను మించే ప్రతిసారి తన సినిమాను చేస్తూ వచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే ఇండియన్ సినీ ప్రేమికులు ఆసక్తి కనబర్చుతారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా కాన్సెప్ట్ ఏంటి, జోనర్ ఏంటి అనే విషయాలను జక్కన్న ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.
