ఆ సినిమా సక్సెస్ నన్ను ఆశ్చర్యపరిచింది
భారతీయ సినిమాను ప్రపంచ పటంలో మరింత శక్తివంతంగా నిలబెట్టాలన్న తన కలను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి స్పష్టంగా వ్యక్తపరిచారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Feb 2026 8:00 PM ISTభారతీయ సినిమాను ప్రపంచ పటంలో మరింత శక్తివంతంగా నిలబెట్టాలన్న తన కలను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి స్పష్టంగా వ్యక్తపరిచారు. జపాన్ యానిమేషన్, కొరియన్ కె-పాప్ తరహాలో భారతీయ సినిమాలకు కూడా గ్లోబల్ స్థాయిలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కంటెంట్‌కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చూపిస్తూ, భారత కథలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావం చూపగలవని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
స్పెషల్ గా జపాన్‌కు చెందిన యానిమేషన్ మూవీ డెమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇండియాలో కూడా ఘన విజయం సాధించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని రాజమౌళి తెలిపారు. భాషా అవరోధాలు ఉన్నప్పటికీ, బలమైన కథనం, ఎమోషన్స్, సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రపంచ ఆడియన్స్ దాన్ని స్వీకరిస్తారనే విషయం దీంతో తనకు స్పష్టమైందన్నారు. ఇదే విధంగా మన దేశంలోని పౌరాణిక, చారిత్రక, సామాజిక కథలను కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాజమౌళి పేర్కొన్నారు.
తెలుగు సినిమాను నెక్ట్స్ లెవెల్ కు జక్కన్న
రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే, భారతీయ చిత్రసీమకు కొత్త దిశను చూపిన దర్శకుడిగా ఆయన నిలిచారు. భారీ బడ్జెట్, టెక్నాలజీ డెవలప్‌మెంట్, అదిరిపోయే ప్రమోషనల్ స్ట్రాటజీలతో ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలు ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన మైలురాళ్లుగా గుర్తింపు పొందాయి. భారతీయ పురాణ గాథల్ని ఆధునిక సాంకేతికతతో మేళవించి ప్రేక్షకులకు అందించిన తీరు ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది.
నాటు నాటు సాంగ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
ఇక రాజమౌళి నుంచి ఆఖరిగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి దృఢనిశ్చయానికి మరొక నిదర్శనం. స్వాతంత్య్ర మరయోధుల కల్పిత కథనాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు భారతీయ సినిమాకే గర్వకారణమైంది.
రాజమౌళి పనితీరు విషయానికొస్తే ఆయనకు కథపై అసాధారణ పట్టు ఉంది. పాత్రల భావోద్వేగాలు, విజువల్ స్పెక్టకిల్, సంగీతానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. షూటింగ్‌కు ముందే ప్రతి సన్నివేశాన్ని చాలా క్లియర్ గా ప్లాన్ చేసుకోవడం, టెక్నికల్ టీమ్ తో సమన్వయం సాధించడం ఆయన స్పెషాలిటీ. ఈ క్రమంలో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ, ఇండియన్ టెక్నీషియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలను అందించే దిశగా ఆయన కృషి కొనసాగుతోంది.
భారతీయ సినిమా కేవలం ప్రాంతీయ భాషలకు పరిమితం కాకుండా, ప్రపంచ ప్రేక్షకులను అలరించే స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమని రాజమౌళి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే తన చిత్రాలతో ఆ దిశగా బలమైన అడుగులు వేసిన ఆయన, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ సినిమా వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
