తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కానీ రాజమౌళి మాత్రం తాను తీసిన అన్ని సినిమాల్లో బెస్ట్ మూవీ ఏంటని అడిగితే ఈ రెండు సినిమాల పేర్లు కాకుండా మరో సినిమా పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
By: Tupaki Desk | 17 July 2025 1:30 PM ISTకెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా హిట్టే. వాటిలో రాజమౌళి తీసిన సినిమాల్లో బాహుబలి కి ప్రత్యేక క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి స్థాయితో పాటూ తెలుగు సినిమా స్థాయి కూడా విపరీతంగా పెరిగింది. సౌత్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన సినిమాగా బాహుబలికి క్రెడిట్ దక్కుతుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లింది.
ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాయి ఆ రెండు సినిమాలూ. రాజమౌళి బెస్ట్ సినిమాల్లో ఆ రెండింటికీ ఎప్పటికీ చోటుంటుంది. రాజమౌళి బెస్ట్ వర్క్ సినిమా ఏంటని ఎవరిని అడిగినా ఆ రెండు సినిమాల్లో ఒక సినిమా పేరు చెప్పడం ఖాయం. కానీ రాజమౌళి మాత్రం తాను తీసిన అన్ని సినిమాల్లో బెస్ట్ మూవీ ఏంటని అడిగితే ఈ రెండు సినిమాల పేర్లు కాకుండా మరో సినిమా పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రముఖ రాజకీయ, పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయమవుతున్న జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరవగా ఆ కార్యక్రమంలో రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ లో భాగంగా రాజమౌళి గత సినిమాల వర్కింగ్ స్టిల్స్ ను వేసి ఏం గుర్తొస్తుందని యాంకర్ సుమ అడిగారు.
అందులో భాగంగా ఈగ మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ వచ్చినప్పుడు రాజమౌళి తన బెస్ట్ మూవీ అని చెప్పారు. బాహుబలి సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవడానికి ఈగ సినిమానే ఓ విధంగా కారణమని చెప్పాలని ఆయన అన్నారు. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి ఈగను రిలీజ్ చేయగా ఆ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందాయి. రాజమౌళి చెప్పినట్టు తన బెస్ట్ వర్క్ ఈగనే అవుతుంది. ఒక హీరోని పెట్టి ఎవరైనా సినిమా తీయగలరు. కానీ ఈగను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీసి దాంతో బ్లాక్ బస్టర్ అందుకోవడం రాజమౌళికే చెల్లింది. ఈ విషయంలో జక్కన్న గురించి అందరూ చాలా గొప్పగా చెప్తుంటారు. అందుకే రాజమౌళి కూడా ఈగ తన బెస్ట్ మూవీ అని చెప్పుండొచ్చు.
