'బాహుబలి: ది ఎపిక్' ఫ్యాన్స్‌లో సందేహాలు
బాహుబలి -1, బాహుబలి -2 రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా వీక్షించే అవకాశం ఉంటే మీరు థియేటర్‌కి వెళతారా? కట్టప్ప వెన్నుపోటు లాంటి ప్రశ్న ఇది!
By: Sivaji Kontham | 12 Aug 2025 12:03 AM ISTబాహుబలి -1, బాహుబలి -2 రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా వీక్షించే అవకాశం ఉంటే మీరు థియేటర్‌కి వెళతారా? కట్టప్ప వెన్నుపోటు లాంటి ప్రశ్న ఇది! నిజానికి బాహుబలి కథను ఒకే సినిమాగా తెరపై చూడాలని చాలా మంది ఉత్సాహపడ్డారు. కానీ ఆ కల వారికి ఇప్పటికీ నెరవేరలేదు. ఎట్టకేలకు బాహుబలి -1, బాహుబలి -2 రెండు సినిమాలను మెర్జ్ చేసి ఒకే సినిమాగా వీక్షించేలా 4కే వెర్షన్ ని రెడీ చేసి రిలీజ్ కి సిద్ధం చేసారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం `బాహుబలి- ది ఎపిక్` పేరుతో విడుదల కానుంది.
ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతున్న కూలీ లేదా వార్ 2 సినిమాను వీక్షించే ప్రేక్షకులు `బాహుబలి: ది ఎపిక్` టీజర్- ఫస్ట్ లుక్‌ను వీక్షించే అవకాశం ఉంది. బాహుబలి విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా ఇప్పుడు ఒకే వెర్షన్ ని రిలీజ్ చేయడం ద్వారా మరోసారి ప్రజల్లోకి వెళుతున్నామని రాజమౌళి గతంలో తెలిపారు.
తాజాగా 31 అక్టోబర్ రిలీజ్ తేదీతో రూపొందించిన స్పెషల్ పోస్టర్ లో ప్రభాస్ వర్సెస్ రానా లుక్ హైలైట్ గా కనిపిస్తోంది. సూర్యవంశపు రాజు బాహుబలి, అతడి సోదరుడైన భళ్లాల దేవుడిని ఈ పోస్టర్ లో చూపించారు. వార్ సమయంలో ఆ ఇద్దరి రౌద్ర రసాన్ని ఆవిష్కరిస్తూ అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పుడు బాహుబలి- ది ఎపిక్ లో రెండు భాగాల సినిమాను ఒకే చిత్రంగా చూపించాలి గనుక చాలా సన్నివేశాలను తొలగించి ఉంటారని అంతా ఊహిస్తున్నారు.
