Begin typing your search above and press return to search.

'రాజాసాబ్‌'తో అంతా గందరగోళం అయ్యేనా..?

నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాను 2025 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.

By:  Ramesh Palla   |   1 Aug 2025 7:00 PM IST
రాజాసాబ్‌తో అంతా గందరగోళం అయ్యేనా..?
X

ప్రభాస్‌ 2023లో సలార్‌, 2024లో కల్కి 2898 ఏడీ సినిమాలతో వచ్చిన విషయం తెల్సిందే. 2025లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాలతో ప్రభాస్‌ వస్తాడని అంతా భావించారు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్‌ వస్తాడు అనుకుంటే కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాను 2025 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. మేకర్స్ సైతం డిసెంబర్‌లో వస్తామంటూ అధికారికంగా డేట్‌ను కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాసాబ్ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌కి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజాసాబ్‌ డిసెంబర్‌లో వచ్చేనా..?

గత రెండు మూడు ఏళ్లుగా రాజాసాబ్‌ సినిమా గురించిన ప్రచారం జరుగుతోంది. సలార్‌, కల్కి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను దక్కించుకున్న ప్రభాస్‌ ను రాజాసాబ్‌ లో మరో లెవల్‌లో చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు మారుతి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. రాజాసాబ్‌ సినిమా హర్రర్‌ కామెడీ థ్రిల్లర్‌ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే సమయం ఎక్కువగా తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రావాల్సిన రాజాసాబ్‌ సినిమా కనీసం డిసెంబర్‌కి కూడా రాకుండా 2026 కి వాయిదా పడితే ఖచ్చితంగా ఫ్యాన్స్‌ నుంచి గట్టి వ్యతిరేకత మేకర్స్‌ ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినా సినిమా తేదీని మార్చాల్సిందే అని, 2026 సంక్రాంతికి వస్తామని రాజాసాబ్‌ మేకర్స్‌ భావిస్తే ఇతర సినిమాల విడుదల విషయంలో గందరగోళం తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి చిరంజీవి, అనిల్‌ రావిపూడి సినిమా

2026 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందని, అక్టోబర్‌ లేదా నవంబర్‌ వరకు షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టాలని అనిల్‌ రావిపూడి భావిస్తున్నాడు. మరో వైపు ప్రమోషన్స్‌ స్టఫ్‌ని కూడా అనిల్‌ రావిపూడి రెడీ చేసుకుంటున్నాడు. మరో వైపు రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా సైతం సంక్రాంతికి రాబోతుంది. ఇప్పటికే ఆ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమా సైతం సంక్రాంతికి రాబోతుంది. ఇక తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా రూపొందుతున్న చివరి మూవీ జన నాయగన్‌ను 2026 పొంగల్‌కి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

పొంగల్‌ రేసులో పలు తమిళ సినిమాలు

తమిళనాట జన నాయగన్‌ సినిమాతో పాటు శివ కార్తికేయన్‌ పరాశక్తి సినిమాను సైతం పొంగల్‌ కి విడుదల చేయబోతున్నారు. ఇటీవల సూర్య హీరోగా బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సైతం 2026 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఉన్న సమయంలో పాన్ ఇండియా రేంజ్‌లో రాజాసాబ్‌ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయడం అనేది చాలా పెద్ద గందరగోళంను క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ వంటి సూపర్‌ స్టార్‌ సినిమాకు పండుగ స్పెషల్‌ డేట్‌ అవసరం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. కనుక సంక్రాంతికి రాజాసాబ్‌ అనేది కేవలం పుకారు అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు. వస్తే 2025 డిసెంబర్‌లో అయినా రావాలి.. లేదంటే 2026 సమ్మర్ వరకు సినిమా కోసం వెయిట్‌ చేయాల్సి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది మారుతి నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.