Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయికి అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డు!

నుదుటిన పెద్ద బొట్టు, భార‌తీయ‌త ఉట్టిప‌డే ఆహార్యంతో పాటూ అమెరికన్ యాక్సెంట్ తో ర్యాప్ ప్ర‌పంచంలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజ‌కుమారి అస‌లు పేరు శ్వేతా రావు ఎల్లాప్ర‌గ‌డ.

By:  Tupaki Desk   |   30 May 2025 12:46 PM IST
తెలుగ‌మ్మాయికి అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డు!
X

నుదుటిన పెద్ద బొట్టు, భార‌తీయ‌త ఉట్టిప‌డే ఆహార్యంతో పాటూ అమెరికన్ యాక్సెంట్ తో ర్యాప్ ప్ర‌పంచంలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజ‌కుమారి అస‌లు పేరు శ్వేతా రావు ఎల్లాప్ర‌గ‌డ. ఆమె స్టేజ్ ఎక్కిందంటే అక్క‌డున్న ఆడియన్స్ మొత్తం ఉర్రూత‌లూగ‌డం ఖాయం. ఓ వైపు ర్యాప్ తో పాటూ మ‌రోవైపు హిప్ హాప్ తో అద‌ర‌గొడుతూ షో ను ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డును గెలుచుకున్న రాజ‌కుమారి భార‌తీయురాలే. అంతేకాదు తాను తెలుగ‌మ్మాయి కూడా. రాజ‌కుమారి అస‌లు పేరు శ్వేతా రావు. శ్వేత పుట్టక‌ముందే త‌న పేరెంట్స్ అమెరికాలో సెటిలవ‌డంతో తాను పుట్టి పెరగ‌డం మొత్తం అక్క‌డే జ‌రిగాయి. చ‌దువు కూడా కాలిఫోర్నియాలోనే. అయితే అమెరికాలో ఉన్న‌ప్ప‌టికీ శ్వేతా ఫ్యామిలీ తెలుగు సంప్ర‌దాయాన్ని వీడ‌లేదు.

ఐదేళ్ల వ‌య‌సు నుంచే శాస్త్రీయ నృత్యంలో భాగంగా కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, క‌థ‌క్ నేర్చుకుని దేశ‌విదేశాల్లో పెర్ఫార్మెన్సులు ఇచ్చింది. అమెరికాలోని హిప్ హాప్ గ్రూప్ ఫ్యూజీ చేసిన ది స్కోర్ ఆల్బ‌మ్ చూసి ఇంట్రెస్ట్ తో తాను కూడా అది నేర్చుకుని 14 ఏళ్ల‌కే హిప్ హాప్ డ్యాన్స‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. హిప్ హాప్ డ్యాన్స‌ర్ గా కంటిన్యూ అవుతూనే ర్యాప‌ర్ గా సాంగ్స్ రాసి పాడుతుంటే త‌న ఫ్రెండ్స్ విని ఎంజాయ్ చేస్తూ త‌న‌ను ది ఇండియ‌న్ ప్రిన్సెస్ అని పిలిచేవార‌ట‌. దానికి తెలుగు అర్థం రాజ‌కుమారి కాబ‌ట్టి, ర్యాప‌ర్ గా మారాక త‌న పేరును కూడా రాజ‌కుమారిగా మార్చుకుంది శ్వేతారావు.

శ్వేతారావు పేరుతో సాంగ్స్ పాడితే ఆడియ‌న్స్ కు ఇంట్రెస్ట్ ఉండ‌ద‌ని, ర్యాప‌ర్ రాజ‌కుమారిగా పేరు మార్చుకుని, స్టేజ్ మీద పాట మ‌ధ్య‌లో అమ్మ‌వారి స్టైల్ లో డ్యాన్స్ చేసి పేరుకు త‌గ్గ ర్యాప‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ర్యాపర్ గా మారిన కొన్నాళ్ల‌కే గ్రామీ అవార్డుకు నామినేట్ అవ‌డంతో పాటూ బీఎమ్ఐ పాప్ అవార్డును కూడా అందుకుంది. ఎంటీవీ యూరోపియ‌న్ మ్యూజిక్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అయిన రాజ‌కుమారి గ‌తేడాది ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సీజ‌న్2 కోసం పాడిన రెనెగేడ్ సాంగ్ తో రీసెంట్ గా అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డును సొంతం చేసుకుంది.

రాజ‌కుమారి ఎంత అమెరికాలో పుట్టిన‌ప్ప‌టికీ ఏటా హైద‌రాబాద్ వ‌చ్చి కొన్నాళ్ల‌పాటూ త‌న నాన్న‌మ్మ ద‌గ్గ‌ర ఉండి వెళ్లేద‌ట‌. అందుకే త‌న నాన్న‌మ్మ జ్ఞాప‌కార్థం పీస్ సాంగ్స్ చేసింది. చిన్న‌ప్ప‌ట్నుంచి రాజ‌కుమారికి రెహ‌మాన్ సంగీత‌మ‌న్నా, మాధురీ దీక్షిత్ న‌ట‌న‌న్నా ఎంతో ఇష్టమ‌ట‌. రెహ‌మాన్ సంగీతంలో దిల్ బేచారా సినిమాలో పాట‌తో ఆ క‌ల నెర‌వేర‌డంతో పాటూ మాధురీతో మంచి బాండింగ్ కూడా ఏర్ప‌డింది. 2017లో ముంబైకి చెందిన ర్యాప‌ర్ డివైన్ తో క‌లిసి ఓ స్ట్రీట్ సాంగ్ తో ఇండియ‌న మ్యూజిక్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజ‌కుమారి రేస్3, జీరో, జడ్జిమెంట‌ల్ హై క్యా సినిమాల‌ను వ‌ర్క్ చేసింది. తెలుగులో వెంక‌టేష్ అటెన్ష‌న్ ఎవ్రీబ‌డీతో పాటూ ఉమెన్స్ డే కోసం ఐయామ్ రెబ‌ల్ సాంగ్ కూడా చేసింది. అంతేకాదు, మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో వివ‌క్ష‌ను ఎదుర్కొంటున్న సింగ‌ర్స్ కోసం గాడ్‌మ‌ద‌ర్ రికార్డ్స్ పేరుతో ఓ లేబుల్ ను ఏర్పాటు చేసిన రాజ‌కుమారి జ‌వాన్, బేబీ జాన్ సినిమాల‌కు కూడా పాడింది. త‌న ప్ర‌తీ షో నుంచి వ‌చ్చిన ఆదాయంతో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న రాజ‌కుమారి, అందులో భాగంగానే బెంగుళూరు ఓ హాస్పిట‌ల్ ను క‌ట్టించ‌డ‌డంతో పాటూ హైద‌రాబాద్ లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఓ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.