Begin typing your search above and press return to search.

సింహాసనం పాటలతో ఊపేసిన రాజ్ సీతారాం ఆ తరువాత ?

తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో గాయనీ గాయకులు ఉన్నారు. అందరూ ప్రతిభావంతులే. లేకపోతే ఆ స్థాయి దాకా వచ్చేవారు కాదు, కానీ కొందరే సుదీర్ఘ కాలం కొనసాగారు.

By:  Satya P   |   22 March 2026 9:00 AM IST
సింహాసనం పాటలతో ఊపేసిన రాజ్ సీతారాం ఆ తరువాత ?
X

తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో గాయనీ గాయకులు ఉన్నారు. అందరూ ప్రతిభావంతులే. లేకపోతే ఆ స్థాయి దాకా వచ్చేవారు కాదు, కానీ కొందరే సుదీర్ఘ కాలం కొనసాగారు. అనేక మంది టాలెంట్ ఉన్నా లక్ కలసి రాక తెర వెనక్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా చూస్తే సూపర్ స్టార్ క్రిష్ణకు ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాటలు పాడిన రాజ్ సీతారాం ఒక సమయంలో టాప్ చెయిర్ దాకా వచ్చేశారు. కానీ చూస్తూండగానే అంతలోనే కెరీర్ ముగిసిపోయింది. మరి ఈ మధ్యలో ఏమైంది అన్నదే ఆయన పాటలని నేటికీ వినే అభిమానులు అంతా అనుకునే విషయం.

చదువుకుంటూనే :

ఇక రాజ్ సీతారాం చెన్నైలో వివేకానంద కాలేజీలో బీఏ డిగ్రీ చేస్తూండగా అనుకోకుండా తెలుగు చలన చిత్ర రంగం నుంచి పిలుపు వచ్చింది. ఆయన తన చదువుతో పాటు ఆర్కెస్ట్రా ని కూడా నిర్వహిస్తూ వచ్చారు. అలా ఒకసారి సేలంలో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో రాజ్ సీతారాం పాడుతూండగా చూసిన ప్రముఖ వయొలనిస్ట్ వైద్య నాధన్ తను తమిళంలో నిర్మించిన తోడి రాగంలో తొలిసారి అవకాశం ఆయనకు ఇచ్చారు. అలా తమిళ్ లో పాడిన రాజ్ సీతారాం ని తెలుగులో పరిచయం చేసిన ఘనత సంగీత దర్శకుడు సత్యం కి దక్కుతుంది. ఆయన నరేష్ పూర్ణిమా జంటగా నటించిన అగ్ని సమాధి సినిమాలో రాజ్ సీతారాం చేత రెండు పాటలు పాడించారు. నీ తోడే కావాలి అన్న డ్యూయెట్ సూపర్ హిట్ కావడంతో రాజ్ సీతారాం ప్రతిభ టాలీవుడ్ కి తెలిసింది. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు శోభన్ బాబు హీరోగా నిర్మించిన జగన్ మూవీలో ఒక పాటను పాడించారు చక్రవర్తి మ్యూజిక్ లో రాజ్ సీతారాం పాడిన అది ఒక రాత్రి అనే మెలొడీ పాట కూడా మంచి హిట్ కావడంతో రాజ్ సీతారాం కి తెలుగులో అవకాశాలు వచ్చాయి.

క్రిష్ణతో తొలిసారి :

ఇక ఈ మధ్యలో సూపర్ స్టార్ క్రిష్ణతో ఎస్పీబీకి చిన్న మనస్పర్థలు రావడంతో వేరే వారితో పాడించాలని చూస్తున్నారు. ఆ సమయంలో రాజ్ సీతారాం గురించి తెలియడంతో పిలిపించారు. అలా క్రిష్ణకు తొలిసారి సూర్య చంద్ర మూవీకి రాజ్ సీతారాం గొంతు కలిపారు. రమేష్ నాయుడు మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ సినిమాలో అన్ని పాటలూ మెలోడీ సాంగ్స్ గా నిలిచిపోయాయి. ఇక 1985 చివరిలో క్రిష్ణ సింహాసనం మూవీని నిర్మించ తలపెట్టారు. దాని కోసం బప్పీలహరిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో పాడే చాన్స్ యువకుడు అయిన రాజ్ సీతారాం కి దక్కడం మాత్రం గ్రేట్ అని చెప్పాలి ఈ సినిమాలో అన్ని పాటలూ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. అందులో ఆకాశంతో ఒక తార సాంగ్ ఈ రోజుకీ ప్రతీ వారి మనసులో ఉంటుంది.

వరసబెట్టి చాన్సులు :

ఇక రాజ్ సీతారాం సింహాసనం మూవీ సూపర్ హిట్ తరువాత వెనక్కి చూసుకోలేదు, వరసగా క్రిష్ణకు నేపధ్య గాయకుడిగా పాడుతూ ఎన్నో హిట్ సాంగ్స్ ని అందించారు. అలా చూస్తే ఖైదీ రుద్రయ్య, ముద్దాయి, దొంగ గారు స్వాగతం, తండ్రి కొడుకుల ఛాలెంజ్, శాంతి నివాసం ఇలా ఎన్నో సినిమాల్లో రాజ్ సీతారాం గొంతు క్రిష్ణకు సక్సెస్ గా మారింది. మూడేళ్ళ కాలంలో వందలాది పాటలు పాడారు. అయితే 1988 ప్రాంతంలో ఒక తమాషా జరిగింది.

కలసిపోయిన వైనం :

ఎస్పీ బాలూ కృష్ణ ఇద్దరూ కలిసి పోయారు. దాంతో బాలూ క్రిష్ణకు మళ్ళీ పాడడం జరిగింది. దాంతో రాజ్ సీతారాం కి అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దాంతో ఆయన తిరిగి తాను ఆపేసిన చదువుని కొనసాగించారు. ఆ మీదట ఆయన విదేశాలకు వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఈ రోజున ఆయన ఒక విదేశీ సంస్థలో కీలక స్థానంలో పనిచేస్తున్నారు. పాటలకు స్వస్తి చెప్పి తన జీవితాన్ని కొనసాగిస్తున్న రాజ్ సీతారాం పాడిన అనేక సినిమా పాటలు మాత్రం అభిమానులకు ఎపుడూ గుర్తుండిపోతాయని చెప్పాలి.