Begin typing your search above and press return to search.

రాహుల్ ఓపెన్ స్టేట్మెంట్లు.. టాలీవుడ్ ఏమంటుందో?

ఇలాంటి సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి.

By:  M Prashanth   |   12 May 2026 1:44 PM IST
రాహుల్ ఓపెన్ స్టేట్మెంట్లు.. టాలీవుడ్ ఏమంటుందో?
X

టాలీవుడ్‌ లో ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి, ప్రేక్షకుల అభిరుచులు, టికెట్ ధరలు, సినిమా క్వాలిటీపై పెద్ద చర్చ ఎత్తున నడుస్తోంది. భారీ బడ్జెట్లతో, స్టార్ హీరోలతో తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో రాహుల్ రామకృష్ణ చేసిన వరుస పోస్టులు నేరుగా టాలీవుడ్ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తాయి. "ఖాళీగా ఉన్న థియేటర్లు మనం చేస్తున్న పని ఎంత దారుణంగా ఉందో చెప్పే నిజాయితీ తీర్పు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కేవలం ఓటీటీలు కారణం కాదని, అసలు సమస్య కంటెంట్ క్వాలిటీలో ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు.

ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ పూర్తిగా మారిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరోలు, భారీ సెట్లు, హైప్ ఉంటే చాలు సినిమా ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, ప్రేక్షకులు కేవలం మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్, కొత్త అనుభూతి ఇచ్చే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన సూచించారు. అందుకే ఇటీవల కొన్ని చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తుండగా, భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు.

ఇక థియేటర్లకు రావడం సాధారణ ప్రేక్షకుడికి ఎంత కష్టంగా మారిందో కూడా రాహుల్ తన పోస్టులో ప్రస్తావించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో అధిక స్నాక్స్ ధరలు, టికెట్ రేట్లు—అన్నీ కలిపి సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి థియేటర్‌కు రావాలంటే సినిమా నిజంగా ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్‌ లో లేదా ఓటీటీలో చూడలేని విజువల్ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌ లో ఉండాలని పేర్కొన్నారు.

ఆ తర్వాత దర్శక నిర్మాతలపై కూడా రాహుల్ పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయొద్దని, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సినిమా మేకింగ్‌ పై అవగాహన పెరిగిందని చెప్పారు. డిజిటలైజేషన్ కారణంగా కెమెరా వర్క్, స్క్రీన్‌ ప్లే, టెక్నికల్ అంశాలపై సాధారణ ప్రేక్షకులకు అవగాహన వచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రేక్షకుడిని మోసం చేసే ప్రయత్నం చేయకుండా, క్వాలిటీ కంటెంట్ పై దృష్టి పెట్టాలని సూచించారు.

టికెట్ ధరల విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుడి జేబుకు భారమయ్యే రేట్లు పెట్టి, అదే సమయంలో కంటెంట్ పరంగా నిరాశ పరిస్తే థియేటర్లకు జనాలు రావడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకులను గౌరవించేలా సినిమాలు ఉండాలని, వారిని అవమానిస్తూ అభిమానాన్ని ఆశించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు చూసిన తర్వాత తాను వ్యాఖ్యలు చేశానని రాహుల్ రామకృష్ణ వెల్లడించారు. ఎప్పుడూ తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పే ఆయన, ఈసారి కూడా టాలీవుడ్‌ లో ఉన్న అసలు సమస్యలపై నేరుగా మాట్లాడారని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై దర్శక నిర్మాతలు, ప్రముఖులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా టాలీవుడ్ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.