మెగా ఫోన్ పడుతున్న మరో కమెడియన్!
టాలీవుడ్‌లో కమెడియన్‌లు దర్శకులుగా మారడం తెలిసిందే. అయితే అందులో చాలా వరకు సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువే.
By: Tupaki Desk | 14 Jun 2025 1:00 PM ISTటాలీవుడ్‌లో కమెడియన్‌లు దర్శకులుగా మారడం తెలిసిందే. అయితే అందులో చాలా వరకు సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువే. కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారి ఎమోషనల్ మూవీ `బలగం`ని రూపొందించి ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కమెడియన్ తరహాలోనే మరో కమెడియన్ డైరెక్టర్‌గా మారి మెగా ఫోన్ పట్టాబోతున్నాడు. తనే రాహుల్ రామకృష్ణ. త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
దీనికి సంబంధించిన ప్రయత్నాలని ఇప్పటికే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మొదలు పెట్టాడు. తాను దర్శకత్వం వహించనున్న ఫస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపిక ఇప్పటికే ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం ఆయన ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. `దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్, ఫొటోలను నా మెయిల్‌కు పంపగలరు` అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు రాహుల్ రామకృష్ణనే నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా మారిన రాహుల్ రామకృష్ణ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ `సైన్మా`తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించిన `జయమ్ము నిశ్చయమ్మురా` సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఇదే సినిమాకు తను డైలాగ్ రైటర్‌గా కూడా పని చేశాడు.
విజయ్ దేవరకొండ హీరోగా 2017లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన `అర్జున్‌రెడ్డి` సినిమాతో నటుడిగా మంచి తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తూ హీరోలకు సపోర్టింగ్ యాక్టర్‌గా మంచి క్రేజ్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక పాత్రలలో నటిస్తూ క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఇప్పుడు దర్శకుడిగా మారుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేణు తరహాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటాడో లేదో వేచి చూడాల్సిదే.
