నిర్మాతలను ముంచేసే లాజిక్కులు..రఘు కుంచె ఆవేదన!
ప్రస్తుత చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎవరు ఎంతగా గొంతెత్తినా దానికి ఫలితం శూన్యం.
By: Sivaji Kontham | 5 April 2026 10:56 AM ISTప్రస్తుత చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎవరు ఎంతగా గొంతెత్తినా దానికి ఫలితం శూన్యం. అయినా ఇప్పుడు సంగీత దర్శకుడు రఘు కుంచె చిన్న సినిమాల నిర్మాతలను వ్యాపారులు ఎలా మోసం చేస్తారో వివరిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ``ఎదుటివాడి రూపాయి మీద మనం రూపాయి సంపాదించాలి`` అనే ధోరణి ఇండస్ట్రీలో పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. ఒక చిన్న సినిమా కోసం నిర్మాత తన సొంత డబ్బుతో దాదాపు 1 నుండి 2 కోట్ల రూపాయలు వెచ్చించి చిన్న సినిమా షూటింగ్ చేస్తాడు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ వంటి అన్ని బాధ్యతలను మోస్తాడు. చివరికి విడుదల సమయానికి వచ్చేసరికి వింత పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా పూర్తయ్యాక థియేటర్ల కోసం వెళ్తే... డిస్ట్రిబ్యూటర్లు లేదా ప్రదర్శనదారులు చెబుతున్న లాజిక్ ఏంటో తనకు అర్థం కావడం లేదని రఘు కుంచె ప్రశ్నించారు. బడ్జెట్ అంతా నిర్మాత పెడితే... కేవలం థియేటర్లు ఇస్తున్నామనే కారణంతో లాభాల్లో 60 శాతం వాటా అడగడం ఎంతవరకు సమంజసం? అని ఆయన నిలదీశారు. పెట్టుబడి పెట్టి పూర్తి రిస్క్ తీసుకున్న నిర్మాతకు కేవలం 40 శాతం లేదా 50 శాతం మాత్రమే ఇవ్వడం వల్ల చిన్న సినిమాలు బతకడం అసాధ్యమని ఆయన కుండబద్ధలు కొట్టారు.
నిజానికి సినిమా బాగుంటేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని.. కంటెంట్ అందించిన నిర్మాతకు గౌరవం దక్కకుండా...కేవలం థియేటర్లు ఉన్న వారు ఎక్కువ లాభాలు ఆశించడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఈ విధమైన దోపిడీ ధోరణి వల్ల భవిష్యత్తులో చిన్న సినిమాలు.. చిన్న నిర్మాతలు కనుమరుగైపోయే ప్రమాదం ఉందని ఈ వ్యవస్థలో మార్పు రావాలని రఘు కుంచె తన గళాన్ని వినిపించారు.
క్రియేటర్లకు రాయల్టీ ఎక్కడ?
రీమిక్స్ పాటల సంస్కృతిపై కూడా రఘు కుంచె ఘాటుగా స్పందించారు. పాత హిట్ పాటలను రీమిక్స్ చేయడానికి ప్రస్తుతం 15 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. ఆశ్చర్యకరంగా అప్పట్లో ఆ ఒరిజినల్ సినిమా మొత్తం బడ్జెట్ కూడా అంత ఉండేది కాదని ఆయన గుర్తు చేశారు. రీమిక్స్ పేరుతో పాత పాటలను వాడుకుంటున్న పెద్ద సంస్థలు లాభపడుతున్నాయి తప్ప ఆ పాటను సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్లకు, రచయితలకు దక్కాల్సిన వాటా అందడం లేదని రఘు ఆవేదన చెందారు.
చట్ట ప్రకారం.. ప్రతి సంగీత దర్శకుడికి, రచయితకు 15 శాతం రాయల్టీ రావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. టెక్నీషియన్ల మేధో సంపత్తికి తగిన గుర్తింపు , ప్రతిఫలం దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. క్రియేటర్లను విస్మరించి కేవలం మ్యూజిక్ కంపెనీలు మాత్రమే లబ్ధి పొందడం అన్యాయమని రాయల్టీ విషయంలో పారదర్శకత ఉండాలని రఘు కుంచె కోరారు.
