గుండె తరుక్కుపోతుంది.. ఒక్కసారి కలువు
ఓ నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సౌత్ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్.
By: Tupaki Desk | 30 Jun 2025 12:14 AM ISTఓ నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సౌత్ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించిన ఆయన సాయం కోరిన ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటారనే సంగతి తెలిసిందే. తన సొంత డబ్బుతో ఆశ్రమాలు నిర్మించి ఎంతో మంది పేదలకు నీడను కల్పించారు లారెన్స్.
ఎంతో మంది అనాథలను చేరదీసి వారికి చదువు చెప్పించి మంచి జీవితాన్ని ఇచ్చిన లారెన్స్ తెలుగులో మాస్ సినిమా చేస్తున్న సమయంలో ఓ చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకున్నారు. అతనే రవి రాథోడ్. విక్రమార్కుడు, మాస్ సహా 50కి పైగా సినిమాల్లో నటించాడు. రవి రాథోడ్ ను లారెన్స్ దత్తత తీసుకుని స్కూల్ లో జాయిన్ చేయగా, ఒక ఏడాది తర్వాత ఆ పిల్లాడు స్కూల్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు.
తప్పిపోయిన ఆ ఆ పిల్లాడి కోసం లారెన్స్ వెతుకుతూనే ఉన్నప్పటికీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. అయితే రీసెంట్ గా రవి రాథోడ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో లారెన్స్ గురించి మాట్లాడారు. లారెన్స్ తనను దత్తత తీసుకుని స్కూల్ లో చేర్పించారని, కానీ ఆ అవకాశాన్ని తాను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయానని, సెలవుల టైమ్ లో ఆ హాస్టల్ నుంచి పారిపోయానని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అటు వైపు వెళ్లలేదని, ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే కొడతారో, తిడతారోననే భయం ఉందని రవి చెప్పారు.
ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి లారెన్స్ దగ్గరకు వెళ్లగా, అది చూసి లారెన్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. నేను నిన్ను కొట్టను, తిట్టను, ఒకసారి వచ్చి కలువు, నిన్ను చూడాలనుంది, నీ కోసం ఎదురుచూస్తుంటా" అని లారెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అప్పుడెప్పుడో దత్తత తీసుకుని పారిపోయిన పిల్లాడిపై లారెన్స్ చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే అతని మనసు ఎంత మంచిదో అర్థమవుతుంది.
