Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడు నో అన్నాడు.. ఇంకెవరైనా ఉన్నారా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రూపొందిన సూపర్‌ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.

By:  Tupaki Desk   |   1 Jan 2024 2:30 PM GMT
దర్శకేంద్రుడు నో అన్నాడు.. ఇంకెవరైనా ఉన్నారా?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రూపొందిన సూపర్‌ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అప్పటికి ఇప్పటికి సంచలనం అనడంలో సందేహం లేదు. ఎవర్ గ్రీన్ టాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నిలుస్తుంది.

అలాంటి సూపర్‌ హిట్ సినిమాను రీమేక్ చేయాలని, సీక్వెల్‌ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మెగాస్టార్‌ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా చరణ్ హీరోగా ఆ సినిమాను రీమేక్ చేస్తే చూడాలని ఆశ పడుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సాహసం చేయడం తన వల్ల కాదు అంటూ రాఘవేంద్ర రావు చెబుతూ వస్తున్నారు.

తాజాగా మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్‌ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్పందిస్తూ.. చాలామంది చరణ్ తో ఆ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని అన్నారు, అశ్వినీదత్ కూడా నాతో రీమేక్ గురించి చాలా సార్లు చర్చించారు. కానీ చరణ్‌ తో రీమేక్ చేస్తే కచ్చితంగా ప్రతి సన్నివేశాన్ని కూడా చిరంజీవి సీన్ ను పక్కన పెట్టి పోల్చి చూస్తారు.

చిరంజీవి మరియు శ్రీదేవి కాంబినేషన్ మ్యాజిక్ అస్తమానం రిపీట్ అవ్వడం సాధ్యం అయ్యే పని కాదు. చాలా కాలంగా చిరు, శ్రీదేవి కాంబో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో మా సినిమా వచ్చి సూపర్‌ హిట్ అయ్యింది. అందుకే మళ్లీ ఆ రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం.. అందుకే సినిమా రీమేక్ పై ఆసక్తి లేదు అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ విషయంలో చేతులు ఎత్తేయడం తో ఆ బాధ్యతలు ఎవరైనా తీసుకుంటారా.. ఆ స్థాయిలో రీమేక్ చేసి మెప్పించగల సత్తా ఎవరికైనా ఉందా... అశ్వినీదత్‌ అలాంటి వారిని వెతికి పట్టుకుంటాడా అనేది చూడాలి.